CM Chandrababu CII conference: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిర్వహించిన సీఐఐ (CII) పార్టనర్షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఆయన ‘సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్’ డాక్యుమెంటరీని ఆవిష్కరించి, రాష్ట్ర ఆర్థిక వృద్ధి, పెట్టుబడులు ఆకర్షించడం, క్వాంటం కంప్యూటింగ్ వంటి అధునాతన సాంకేతికతలపై  పెట్టుబడుల అవకాశాలు వివరించారు. 

Continues below advertisement

2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం 8.25% వృద్ధిరేటు సాధించినట్లు పేర్కొన్నారు. "ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో పలు పాలసీలు తీసుకువచ్చాం. సులభతర వాణిజ్యం నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ ముందుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు మారాం" అని చెప్పారు. "ఇప్పటికే పలుమార్లు వివిధ దేశాల్లో పారిశ్రామికవేత్తలను కలిశాను. వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాం. రాష్ట్రాలను ప్రమోట్ చేసుకోవడానికి సీఐఐ శక్తిమంతమైన వేదిక. రాష్ట్రాల భాగస్వామ్యం లేకుండా భారత వృద్ధి సంపూర్ణం కాదు. రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది సరైన వేదిక" అని అన్నారు. నవంబర్‌లో విశాఖలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు రావాలని పిలుపునిచ్చారు.          

ఆంధ్రప్రదేశ్‌కు వెయ్యి కిలోమీటర్ల మేర తీర ప్రాంతం కలిసి వచ్చే అంశం. ఏపీలో ప్రతి 50 కి.మీ కు పోర్టు ఏర్పాటు చేయాలనేది ఆలోచన. రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాలు నిర్మించబోతున్నాం. ఉత్తమమైన లాజిస్టిక్స్‌కు కేంద్రంగా ఏపీని చేయాలనేది ఆలోచన అని తెలిపారు.  2047 నాటికి 2.47 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనేది యోచన. 10 విధానాలు నిర్దేశించుకుని లక్ష్యం సాధనకు కృషి చేస్తున్నాం. ఉపాధి, పేదరిక నిర్మూలన, ఉత్తమ లాజిస్టిక్స్ ద్వారా లక్ష్య సాధనకు చర్యలు తీసుకుంటాం. సమ్మిళిత వృద్ధి రేటుతో ఏపీ ముందుకెళ్తోందని చెప్పారు. 

 పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానం ద్వారా ఆదాయం సృష్టించినట్లు చెప్పిన చంద్రబాబు, ప్రస్తుతం రాష్ట్రంలో పీ4 విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  స్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, డ్రోన్ సిటీ, ఏరో స్పేస్ సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు.  రెండేళ్లలో రాష్ట్రంలో క్వాంటం కంప్యూటర్ల తయారీ చేపడతామని విశ్వాసం వ్యక్తం చేశారు.    రాష్ట్రంలోని భవిష్యత్ ప్రణాళికలను, పెట్టుబడులు ఆకర్షించడానికి తీసుకునే చర్యలను వివరించడంలో ముఖ్యమైనదిగా మారింది.  

అంతకు ముందు చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. నిర్మలా సీతరామన్ ను కలిసి ఏపీకి రావాల్సిన నిధులపై చర్చించారు. అలాగే కేంద్ర మంత్రిసీఆర్ పాటిల్ ను కలిశారు. అక్కడే బస చేసి రేపు ఢిల్లీ నుంచి నేరుగా విశాఖకు రానున్నారు చంద్రబాబు.