రాజ్యసభలో చంద్రబాబు ప్రస్తావన ఎందుకు..? అయితే గియితే ఆయన అరెస్ట్ ని ఖండిస్తూ టీడీపీ ఎంపీలు ఆ ప్రస్తావన తెచ్చారంటే ఓ అర్థముంది. కానీ అవసరం ఉన్నా లేకపోయినా పదే పదే చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రెండుసార్లు ఆయన పేరు చెప్పి మరీ విమర్శలు చేశారు.
రాజ్యసభలో ఈరోజు జరిగిన చర్చలో కూడా చంద్రబాబు టాపిక్ తీసుకొచ్చారు విజయసాయిరెడ్డి. వాస్తవానికి చంద్రయాన్ సక్సెస్ గురించి శాస్త్రవేత్తలను అభినందించే చర్చ అది. కానీ విజయసాయిరెడ్డి చంద్రయాన్ తో మొదలు పెట్టి చివరకు చంద్రబాబు వద్దకు వచ్చి ఆగారు. చంద్రయాన్-3 తక్కువ బడ్జెట్ తో రూపొందించారని, ఓ భారీ సినిమా బడ్జెట్ కంటే చంద్రయాన్ బడ్జెట్ తక్కువ అని చెప్పారు. అదే సమయంలో మోదీ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి ఎంతో మేలు చేస్తున్నారని చెప్పారు. పనిలో పనిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో శాస్త్రవేత్తలను వేధించారని, జైలులో పెట్టారని, నంబి నారాయణ ఉదంతాన్ని గుర్తు చేశారు విజయసాయిరెడ్డి. అక్కడితో ఆగితే బాగుండేది, కానీ చంద్రబాబు ప్రస్తావన మాత్రం విమర్శలకు దారితీసింది.
ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు తానే అన్నీ కనిపెట్టానని చెప్పుకుంటారని, కంప్యూటర్, సెల్ ఫోన్ కూడా తానే కనిపెట్టానని అంటారని, అలాంటి వ్యక్తి గురించి లోతుగా చర్చించాలన్నారు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు అవన్నీ కనిపెడితే, వాటిపై పేటెంట్ కు భారత్ దరఖాస్తు చేసుకుంటే కోట్ల రూపాయల్లో మనకు ఆదాయం వస్తుందని వెటకారంగా అన్నారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు ఆయన్ను వారించారు, సబ్జెక్ట్ మాట్లాడాలన్నారు. ఎవరు వారించినా వినకుండా విజయసాయి, చంద్రబాబుపై తన అక్కసు వెళ్లగక్కారు.
సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రారంభ సందర్భంలో కూడా చంద్రబాబుపై రాజ్యసభలో తీవ్ర ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి. అవినీతి, వెన్నుపోటుకి చంద్రబాబు కేరాఫ్ అని అన్నారు. చంద్రబాబు గతంలో బీజేపీతో కలసి పనిచేశారని, కాంగ్రెస్, వామపక్షాలతో కూడా పొత్తు పెట్టుకున్నారని, చివరకు అందరికీ వెన్నుపోటు పొడిచారని చెప్పారు విజయసాయిరెడ్డి. ఆయన వెన్నుపోటు ఎపిసోడ్ లు సభకు గుర్తు చేస్తున్నానని చెప్పారు. అఖిలపక్షంలో చంద్రబాబు వ్యవహారాన్ని తీసుకు రావడం తప్పన్నారు. టీడీపీ ఎంపీలు ఆ పని చేసినందుకే తాను రాజ్యసభలో ఆయన వ్యవహారం హైలైట్ చేయాల్సి వచ్చిందన్నారు విజయసాయి.
పదే పదే చంద్రబాబు ప్రస్తావన తేవడం రాజ్యసభలో ఆయన్ను అవమానించేలా మాట్లాడటం విజయసాయి టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీపై అవసరానికి మించి అభినందనలు తెలుపుతూ, కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నారాయన. ఒకరకంగా చంద్రబాబు-బీజేపీ మైత్రి వైసీపీకి ఇష్టం లేదని ఆయన చెప్పాలనుకుంటున్నారు. అయితే చంద్రబాబు ప్రస్తావన తేవడం మాత్రం చాలామంది ఇతర పార్టీల నేతలకు ఇష్టంలేదు. సభలో లేని వ్యక్తి గురించి, ప్రస్తుతం జైలులో ఉన్న వ్యక్తి గురించి మరీ అంత వ్యంగ్యంగా మాట్లాడటం అవసరమా అంటున్నారు. అయితే ఓ వ్యూహం ప్రకారం చంద్రబాబుని టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి. టీడీపీ ఎంపీలు ఆయనపై సింపతీ తేవాలనుకునే ప్రయత్నాలను ఇలా నిలువరిస్తున్నారు.