Chance Of Heavy Rains In AP: అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుండగా.. దీని ప్రభావంతో ఈ నెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందన్న అంచనాలు ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరో 2 రోజుల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫలితంగా ఈ నెల 24 నుంచి అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు, కేరళలో విస్తారంగా.. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో ముఖ్యంగా ఈ నెల 26, 27 తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
ఈ క్రమంలో రాష్ట్రంలో అన్నదాతలకు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ పలు సూచనలు చేశారు. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. పలు జిల్లాల్లో వరి కోతల సీజన్ ప్రారంభం కావడంతో ప్రత్యేకించి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. విపత్కర పరిస్థితులను రైతులు ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తెలంగాణలో ఇదీ పరిస్థితి
అటు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. రాష్ట్రంలో రానున్న 5 రోజులు ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో చలి ప్రభావం అధికంగా ఉంటుందని.. కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. తెల్లవారుజామున 4:30 గంటల నుంచి దట్టమైన పొగ మంచు కప్పేస్తుందన్నారు. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గోరు వెచ్చని నీళ్లు తాగడం సహా ముదురు రంగు దుస్తులు ధరించాలని సూచించారు. జలుబు, దీర్ఘ కాలిక శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్న వారికి దూరంగా ఉండాలని చెప్పారు. ఇన్‌ఫ్లూయెంజా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.