AP Politics: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రముఖ ఆథ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కలిశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కాసేపు మాట్లాడారు. అయితే చాగంటి కోటేశ్వరరావు ఇటీవలే టీటీడీ ధార్మిక సలహాదారుగా నియమితులయ్యారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి చాగంటిని సత్కరించి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రతిమ అందజేశారు. ఈ సందర్భంగా శాంతా బయోటెక్నిక్స్ లిమిటెడ్ ఫౌండర్, ఎండీ డాక్టర్ కే.ఐ. వరప్రసాద్ రెడ్డి కూడా సీఎం జగన్ ను కలిశారు. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం సీఎం నివాసం వద్ద ఉన్న గోశాలను కూడా చాగంటి కోటేశ్వరరావు, కే.ఐ. వరప్రసాద్ రెడ్డి సందర్శించారు. గోశాలను అద్భుతంగా తీర్చిదిద్దారంటూ సీఎం జగన్ పైచాగంటి కోటేశ్వరరావు ప్రశంసలు కురిపించారు.
ఇటీవలే టీటీడీ ధార్మిక సలహాదారుగా నియమితులైన చాగంటి
ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మూడేళ్లుగా వివిధ పారాయణాలు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చాగంటి కోటేశ్వరరావును సలహాదారుగా నియమిస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి గృహంలో ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో హెచ్‌డీపీపీ, ఎస్వీబీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు శుక్రవారం నిర్వహించారు. గ్రామీణ యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచారం
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమిస్తున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. గ్రామీణ యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచార విస్తృతంగా నిర్వహించాలని, గ్రామస్తులకు భజన, కోలాటం సామాగ్రి అందించాలని నిర్ణయించారు. మానవాళి శ్రేయస్సు కోసం యాగాలు, హోమాలు నిర్వహించాలని నిర్ణయించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎస్వీబీసీ తెలుగు, తమిళ ఛానళ్ల తరహాలో కన్నడ, హిందీ ఛానళ్లు ప్రాచుర్యం పొందేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.