Polavaram Project Works: పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)  నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Government) తీరుపై కేంద్రం మండిపడింది. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని వ్యాఖ్యానించింది. వద్దన్నా నీరు నింపుతున్నారని, కాఫర్‌డ్యాం (Polavaram Cofferdam) కొట్టుకుపోతే ఎవరు బాధ్యులని నిలదీసింది. మరో 15 రోజుల్లో తిరిగి సమావేశం కావాలని, అప్పటికి నిర్దేశించిన అంశాల్లో కొన్ని పూర్తిచేసుకుని రావాలని ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంశాలపై మంగళవారం కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ (Debasri Mukherjee), కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారు వెదిరె శ్రీరామ్‌ (Vedire Sriram) సమావేశం నిర్వహించారు.


ఆంధ్రప్రదేశ్‌ నుంచి జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ (Shashi Bhushan Kumar), ఈఎన్‌సీ నారాయణరెడ్డి (Narayana Reddy), పోలవరం సీఈ సుధాకర్‌బాబు (Sudhakar Babu) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ తీరుపై దేబశ్రీ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గైడ్‌బండ్‌ కుంగడానికి బాధ్యత ఎవరిదో ఎందుకు నిర్ధారించలేదని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తిచేయాలనుకుంటున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. 2024 జూన్‌ నాటికి పూర్తిచేయాలని తమ ఉద్దేశమని ఏపీ అధికారులు చెప్పారు.


పోలవరం అంశాలపై ఆంధ్రప్రదేశ్‌ అధికారులకు ఎన్నిసార్లు లేఖ రాసినా స్పందన లేదని ప్రాజెక్టు అథారిటీ సీఈఓ శివనందన్‌ కుమార్‌ సమావేశంలో తెలిపారు. ప్రాజెక్టులో నీళ్లు ఖాళీచేయాలని తాము ఎన్నిసార్లు లేఖ రాసినా పట్టించుకోలేదని ఆయన తెలిపారు. ఇప్పటికే ఎగువ కాఫర్‌డ్యాం తీవ్ర సీపేజీ సమస్యతో కొట్టుకుపోయేలా ఉందని, కాఫర్‌డ్యాం కొట్టుకుపోతే ఎవరు బాధ్యులని అని దేబశ్రీ నిలదీశారు. 


తొలి దశ సవరించిన అంచనా వ్యయం రూ.31,625.36 కోట్లు
పోలవరం జాతీయ ప్రాజెక్టు తొలి దశ సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. తొలి దశ సవరించిన అంచనా వ్యయం రూ.31,625.36 కోట్లుగా ఖరారు చేస్తూ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పంపిన ప్రతిపాదనను మదింపు చేసి సోమవారం కేంద్ర జల్‌ శక్తి శాఖకు నివేదిక ఇస్తామని రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ (ఆర్‌సీసీ) చైర్మన్‌ ఏఎస్‌ గోయల్‌ మంగళవారం తెలిపారు.


ఆ నివేదిక ఆధారంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన ప్రాజెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు (పీఐబీ)కి కేంద్ర జల్‌ శక్తి శాఖ ప్రతిపాదన పంపుతుంది. పీఐబీ ఆమోద ముద్ర వేస్తే సవరించిన అంచనా వ్యయం మేరకు పోలవరం తొలి దశ పనులకు తాజా ధరల మేరకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది.  సీడబ్ల్యూసీ ఆమోదించిన ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ సవరించిన అంచనా వ్యయం రూ.31,625.36 కోట్లని, ఇందులో రూ.16,119.56 కోట్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సభ్య కార్యదర్శి రఘురాం వివరించారు. 


ప్రాజెక్టులో రూ.15,505.80 కోట్ల విలువైన పనులు మిగిలాయని తెలిపారు. తొలి దశ పనులకు రూ.12,911.15 కోట్లు మంజూరు చేసేందుకు జూన్‌ 5న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అంగీకరించారని ఆ శాఖ ప్రధాన సలహాదారు రిచా మిశ్రా గుర్తు చేశారు. తొలి దశ పనుల పూర్తికి మంత్రి ఆమోదించిన వ్యయంకంటే అదనంగా రూ.2,594.65 కోట్లు అవసరమని సీడబ్ల్యూసీ తేల్చిందన్నారు. తొలి దశ పనులకు 2013–14 ధరల ప్రకారం ఎంత అవసరం, 2017–18 ధరల ప్రకారం ఎంత అవసరమన్నది మరింత విపులంగా శుక్రవారంలోగా నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని కోరారు.