CEC Announced MLC Bye Election Date: ఏపీలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) సోమవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేసింది. తూ.గో - ప.గో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక తప్పనిసరైంది. ఈ నెల 11న బై ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది. ఈ నెల 18వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించి.. 19న వాటిని పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 21న తుది గడువుగా నిర్ణయించారు. డిసెంబర్ 5వ తేదీన (గురువారం) ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహించి.. డిసెంబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. కాగా, ఇక్కడ ఎమ్మెల్సీ స్థానంలో పీడీఎఫ్ తరఫున గెలిచిన యూటీఎఫ్ నేత షేక్ సాబ్జీ గతేడాది డిసెంబర్ 15న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన పదవీ కాలం 2027 మార్చి 29 వరకూ ఉండడంతో ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.


3 రాష్ట్రాల్లో ఉప ఎన్నిక తేదీ మార్పు


అటు, దేశంలోని 3 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ తేదీ మారింది. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ మార్చింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 48 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికకు గత నెలలో షెడ్యూల్ విడుదలైంది. కేరళ, పంజాబ్, యూపీ రాష్ట్రాల్లో 14 అసెంబ్లీ స్థానాల్లో ఈ నెల 13న ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. కానీ, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆర్ఎల్‌డీతో పాటు పలు సామాజిక సంస్థలు పోలింగ్ తేదీ మార్చాలని ఈసీకి విజ్ఞప్తి చేశాయి. ఆ రోజున పలు సామాజిక, సాంస్కృతిక, మత సంబంధమైన కార్యక్రమాలు ఉన్నందున ఓటర్ల భాగస్వామ్యం తగ్గే అవకాశం ఉందని తెలిపాయి. దీంతో ఆ పార్టీల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం 3 రాష్ట్రాల పరిధిలోని 14 అసెంబ్లీ సీట్లలో పోలింగ్ తేదీని ఈ నెల 20వ తేదీకి మార్పు చేసింది. కేరళలో ఒకటి, పంజాబ్‌లో 4, యూపీలో 9 నియోజకవర్గాల్లో 20న పోలింగ్ జరగనుండగా.. మిగిలిన స్థానాల్లో మాత్రం తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్ జరగనుంది.


Also Read: Pawan Kalyan: పిఠాపురం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ - విద్యార్థులతో ముచ్చటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్