AP Latest News: ఏపీ క్యాడర్ కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై కొన్నాళ్లుగా ఉన్న సస్పెన్షన్‌ను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌ (క్యాట్‌) కొట్టి వేసింది. ఆయన్ను రెండోసారి సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఒకే కారణంతో ప్రభుత్వం తనను రెండుసార్లు సస్పెండ్‌ చేసిదని వెంకటేశ్వరరావు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ కు వెళ్లారు. పలు దఫాలుగా క్యాట్ విచారణ జరిపిన తర్వాత.. ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయనకు వెంటనే పోస్టింగ్‌ ఇవ్వాలని, సస్పెన్షన్‌ కాలంలో జీతాలు చెల్లించాలని, ఇతర బెనిఫిట్స్ కూడా కల్పించాలని జగన్ ప్రభుత్వాన్ని క్యాట్ ఆదేశించింది.


2019లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ విధించారు. సీనియర్‌ ఐపీఎస్‌ అయిన ఏబీవీని.. రక్షణ సామగ్రి కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల మీద సస్పెండ్‌ చేసింది. ఈ విషయంలో ఏబీవీ క్యాట్‌ను ఆశ్రయించారు. క్యాట్ కూడా ఆ సస్పెన్షన్‌ను సమర్థించింది. దాన్ని కూడా సవాలు చేస్తూ ఏబీవీ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఈ సస్పెన్షన్‌ను కొట్టివేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ హైకోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. 


సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్‌లో ఉంచొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. అలా ఏబీవీపై ఉన్న సస్పెన్షన్‌ రద్దు అయింది. సుప్రీంకోర్టు ఆదేశాలను బట్టి ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టు ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఏబీవీని సస్పెండ్ చేసింది. గతంలో ఏ కారణంతో సస్పెండ్‌ చేసిందో మళ్లీ అదే కారణం చూపుతూ ఏబీవీని సస్పెండ్ చేసింది. అప్పుడు ఏబీవీ క్యాట్ ను ఆశ్రయించగా.. తాజాగా క్యాట్ కీలక ఆదేశాలు ఇచ్చింది. రెండోసారి సస్పెన్షన్‌ చట్టవిరుద్ధమని క్యాట్‌ తేల్చింది.