Andhra Msissing Case :  ఆంధ్రప్రదేశ్‌లో మహిళల మిస్సింగ్ అంశం రాజకీయంగా చర్చనీయాంశమయింది. ఈ మహిళల మిస్సింగ్ వెనుక వాలంటీర్లు ఉన్నారని తనకు కొంత మంది చెప్పారంటూ  పవన్ కల్యాణ్ చేసిన విమర్శలు దుమారం రేపాయి. పవన్ పై కేసులు పెట్టేందుకు ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు పార్లమెంట్ లో కేంద్రం నిజంగానే మూడేళ్లలో మఫ్పై వేల మంది మిస్సయ్యారని అధికారికంగా సమాచారం ఇచ్చింది. మహిళల మిస్సింగ్‌పై పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సమాధానం ఇచ్చింది. ఇందులో 2019 నుంచి 2022 వరకూ మిస్సింగ్ కేసుల వివరాలు అన్ని రాష్ట్రాలవీ ఉన్నాయి.


ఆంధ్రప్రదేశ్‌ లో 2019లో 2186 మంది బాలికలు మిస్సయ్యారు. అంటే 18ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న వారిని బాలికల కేటగరిలో చేరుస్తారు. 6252 మంది మహిళలు మిస్సయ్యారు. అలాగే 2020లో 2374 మంది బాలికలు, 7057  మంది మహిళలు ఆచూకీ లేకుండా పోయారు. 2021లో ఈ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 3358 మంది బాలికలు .. 8969  మంది మహిళలు కనిపించకండా పోయారు. మొత్తంగా వీరి సంఖ్య 30196  మంది.  వీరిలో కొంత మంది ఆచూకీ తర్వతా తెలిసిందని కేంద్ర హోంశాఖ చెబుతోంది. 


దేశం మొత్తం మీద మూడున్నర లక్షల మందికిపైగా చిన్నారులు, మహిళలు మిస్సింగ్ అయినట్లుగా కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. ఏపీ కన్నా తెలంగాణలో ఎక్కువ మిస్సింగ్ కేసుల నమోదయ్యాయి. దాదాపుగా నలభై వేల మంది మిస్సింగ్ అయినట్లుగా  రికార్డులు ఉన్నట్లుగా కేంద్ర హోశాఖ చెబుతోంది.                                 


మహిళల మిస్సింగ్ అంశం రాజకీయంగా ఏపీలో దుమారం రేపడంతో అసలైన డేటా  ఏమిటన్నదానిపై ఆసక్తి ఏర్పడింది. ప్రభుత్వం కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్లలోనే ముఫ్పై వేల మంది మిస్సయ్యారని తేలడంతో ఈ అంశం మరోసారి రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉంది. అయితే మహిళల మిస్సింగ్‌కు... హ్యూమన్ ట్రాఫికింగ్‌కు సంబంధం లేదని వైసీపీ వర్గాలు వాదిస్తున్నాయి. మిస్సింగ్ కేసుల్లో అత్యధికం వెంటనే పరిష్కారమవుతున్నాయని చెబుతున్నారు. ప్రేమ లేకపోతే కుటుంబ సమస్యల కారణంగా  తాత్కలిక ఆవేశంతో ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న వారు మళ్లీ వెనక్కి వస్తున్నారని చెబుతున్నారు.                                         


అసలు ఈ మిస్సింగ్‌లకు వాలంటీర్లకు సంబంధం లేదని.. వాలంటీర్లు లేని చోట్ల కూడా పెద్ద ఎత్తున మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయని చెబుతున్నారు. అయితే మహానగరాలు హైదరాబాద్, ముంబై, బెంగళూరు ఉన్న  రాష్ట్రాల్లో అత్యధిక మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయని... టైర్ 2 సిటీలు ఉన్న ఏపీ లాంటి రాష్ట్రాల్లో అసాధారణ మిస్సింగ్ కేసులు నమోదవడం మాత్రం.. సీరియస్సేనని కొంత మది విశ్లేషిస్తున్నారు.