YS Viveka Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ కేంద్రంగా మరోసారి విచారణ ప్రారంభించారు. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజున ఎంపీ అవినాష్ రెడ్డిని వివేకా ఇంటి వద్ద కలిసిన వారిలో ఐదుగురికి సీబీఐ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పులివెందులకు చెందిన పీబీసీ ఉద్యోగి సుధాకర్‌ను కడపలో సీబీఐ అధికారులు 2 గంటల పాటు ప్రశ్నించారు. ఎంపీ అవినాష్రెడ్డితో ఫోటో దిగిన విషయంపై సీబీఐ సుధాకర్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హత్య జరిగినరోజు వివేకా ఇంటికి వచ్చిన.. వారిలో కొందరిని సీబీఐ విచారణకు పిలిచింది.
12న వైఎస్ భాస్కర్ రెడ్డిని ప్రశ్నించనున్న సీబీఐ అధికారులు
వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు 12వ తేదీన ప్రశ్నించనున్నారు. పన్నెండో తేదీన ఉదయం 10 గంటలకు కడప సెంట్రల్ జైలు లోని అతిథిగృహానికి విచారణకు రావాలని పేర్కొంది. సీబీఐ అధికారుల బృందం బుధవారం పులివెందులలోని భాస్కర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఈ నోటీసులు అందజేసింది. వివేకా హత్య జరిగిన రోజు సంఘటన స్థలంలో సాక్ష్యాధారాలు చెరిపేయడం, హత్య వెనుక భారీ కుట్రను ఛేదించేందుకు ఆయన్ను విచారణకు పిలిచినట్లుగా భావిస్తున్నారు. గత నెల 24న హైదరాబాద్‌లో ఆయన కుమారుడు అవినాశ్‌రెడ్డిని రెండో సారి సీబీఐ విచారించింది.
మరికొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశం !
సీబీఐ అధికారులు దర్యాప్తు విషయంలో చురుకుగా ఉన్నారని మరికొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో విచారణకు పిలిచిన సీఎం జగన్, ఆయన సతీమణి పర్సనల్ అసిస్టెంట్లు కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ లను ఇంకో సారి విచారణకు పిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. కాల్ లిస్ట్ ఆధారంగా ప్రధానంగా విచారణ జరుగుతున్నందున.. వివేకా హత్య జరిగిన రోజున... ఆయన ఇంటి వద్ద నుంచి అనుమానాస్పదంగా ఫోన్లలో మాట్లాడిన వారిని గుర్తించి.. సీబీఐ ప్రశ్నిస్తున్నట్లుగా చెబుతున్నారు.
సునీల్ బెయిల్ నిరాకరణ !
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు జరుగుతున్న సమయంలో బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. నిందితుల స్వేచ్ఛ కంటే సాక్షుల భద్రత, పాదర్శక దర్యాప్తు ముఖ్యమని హైకోర్టు అభిప్రాయపడింది. వాదనల సందర్భంగా... సునీల్ యాదవ్‌కు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కోరింది. వివేకా హత్య కేసు దర్యాప్తు కీలకదశకు చేరుకుందని, హత్యలో రాజకీయ పెద్దల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు వివరించింది. సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.
ఈ కేసులో ఏ వన్ గా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి గతంలోనే బెయిల్ వచ్చింది. ఆయన బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది.