Amalapuram News :  మంత్రి పినిపె విశ్వరూప్ కుమరుడు గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమంలో వెళ్లినప్పుడు కొంత మంది యువకులు నిలదీసిన అంశం వివాదాస్పదమవుతోంది. నిలదీసిన యువకులపై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ కు తరలించారు.  మంత్రి కుమారుడుని  ప్రశ్నిస్తే  అమాయకులను అరెస్టు చేస్తారా అంటూ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ముందు  ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో  అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. 


అమలాపురం రూరల్ మండలం కామనగరువు లో మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ పై తిరగబడిన యువకులను అరెస్టు చేసిన పోలీసులుస్టేషన్ తరలించారు. వారిని కోర్టులో కూడా హాజరు పర్చకుండా స్టేషన్ లోనే ఉంటారు. రెండు రోజుల నుంచి  పోలిస్ స్టేషన్ లొనే ముగ్గురు యువకులు ఉన్నారు.  ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చూపించలేదంటూ బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు.  అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరనస వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు.  మరోసారి అక్రమంగా యువకులను అరెస్టు చేశారని వైసీపీ నాయకులు వాసంశెట్టి సుభాష్ పోలీసులపై మండిపడ్డారు. 


రెండు రోజుల కిందట  అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు పినిపే శ్రీకాంత్ కు చేదు అనుభవం ఎదురైంది. అమలాపురం రూరల్ మండలం కామనగరువు విత్తనాల వారి కాలవగట్టు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి తనయుడు పినిపే శ్రీకాంత్ పాల్గొన్నారు. తండ్రి తరఫున చేపట్టిన ఈ కార్యక్రమంలో.. గ్రామస్థులు ఈయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ తండ్రి మాపై అక్రమంగా కేసులు పెట్టించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు మా గ్రామానికి రావాల్సిన అవసరం ఏంటి అంటూ స్థానికులు విరుచుకు పడ్డారు. తమ బిడ్డలను మూడు నెలల పాటు జైలులో పెట్టించారని కన్నీరు పెట్టుకున్నారు. మీ ఇంటి దహనాలతో మాకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. అధికారం ఉందికదా అని అమాయకులను ఇరికిస్తే... చూస్తూ ఊరుకోం అంటూ స్థానికులు శ్రీకాంత్ పై మండిపడ్డారు. గడప గడపకూ మన ప్రభుత్వంలో భాగంగా కామన గరువు విత్తనాల వారి కాలవగట్టు ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. 


శ్రీకాంత్ వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు మాత్రం ఏమాత్రం మాట వినలేదు. మీ మీద మాకు కోపం లేదని. కానీ మీ తండ్రి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడని తెలిపారు. కేసులు పెట్టించి మళ్లీ మా ఇళ్లకు ఎందుకు వచ్చారు అంటూ ప్రశ్నించారు. తాను ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరించేందుకే వచ్చానని... తనను అర్ధం చేసుకోవాలని శ్రీకాంత్ స్థానికులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా  వారు వినకపోవడంతో చేసేది ఏమి లేక మంత్రి కుమారుడు వెనుదిరిగాడు. చివరికి నిలదీసిన వారిపైన మరోసారి కేసులు పెట్టించారు.