TDP News :  చంద్రబాబు అరెస్ట్ కావడంతో టీడీపీ నేతల రాజకీయ వ్యూహం మారింది. కానీ అంతకు ముందు కొన్ని చేరికలకు ముహుర్తాలు ఖరారు చేసుకున్నట్లగా తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన కీలక నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. గతంలో ఆయన తెలుగుదేశంలోనే ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికలకు ముందు  మరోసారి పార్టీలో చేరాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన కుమార్తె  బైరెడ్డి శబరి బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నరు.                


ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో శాసించిన కుటుంబాల్లో బైరెడ్డి కుటుంబం ఒకటి. మాజీ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డికి రాయలసీమలో మంచి ఫాలోయింగ్ ఉంది. నందికొట్కూరు సెగ్మెంట్‌లో 1994, 1999లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ప్రత్యర్థి గౌరు చరితా రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో నందికొట్కూరు ఎస్సీకి రిజర్వ్ అయ్యింది. దీంతో బైరెడ్డి, గౌరు చరితా రెడ్డిలు పాణ్యంలో పోటీ పడ్డారు. కొన్ని అనివార్య కారణాల వల్ల 2012లో టీడీపీని వీడి ప్రత్యేక రాయలసీమ గళం అందుకున్నారు. ఆ సమయంలోనే రాయలసీమ పరిరక్షణ సమితిని స్థాపించారు.                            


రాష్ర్ట విభజనను తీవ్రంగా వ్యతిరేకించి ప్రత్యేక రాయలసమీ కోసం పోరాటం అందుకున్నారు. రాయలసీమ జిల్లాల్లో పర్యటించారు. ఆశించిన స్థాయిలో ప్రజాదారణ లేకపోవడంతో 2018లో కాంగ్రెస్ లో చేరారు. రాష్ర్ట విభజన కారణంతో 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు.  గౌరు వెంకటరెడ్డి పార్టీ కోసం కలిసి పని చేశారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం దక్కలేదు. ఆ తర్వాత తన కుమార్తె డాక్టర్ బైరెడ్డి శబరితో పాటు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కొంత కాలంగా రాయలసీమ వెనుకబాటుతనంపై గళమెత్తుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ర్టంలోని వైసీపీ తీరును ఎండగడుతున్నారు. రాయలసీమకు నీళ్లు, నిధులు, నియామకాలు చేపట్టాలని కోరుతూ అనేక ఉద్యమాలు చేపడుతున్నారు.                                             


ఇప్పుడు ఎన్నికలకు ముందు ఆయన మళ్లీ టీడీపీలో చేరాలనుకుంటున్నారు.     బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీలో చేరితే జిల్లా రాజకీయ సమీకరణాల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. టీడీపీ అధిష్టానం బైరెడ్డికి నంద్యాల ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోదంి.  చంద్రబాబు విడుదల కాగానే బైరెడ్డి తన అనుచర వర్గంతో పార్టీలో చేరనున్నట్లుగా చెబుతున్నారు.