Pulivendula ZPTC By elections: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఉప ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ మరియు సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉండటంతో, ఆయా స్థానాలకు మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జూలై 28న నోటిఫికేషన్ విడుదలైంది. రామకుప్పం, కారంపూడి, విడవలూరు ఎంపీటీసీ స్థానాలకు, పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు, కొండపూడి, కడియపులంక సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఆగస్టు 12న జరుగుతాయి. ఆగస్టు 14 ఓట్లు లెక్కిస్తారు. సర్పంచ్ ఎన్నికలు ఆగస్టు 10న జరుగుతాయి. ఫలితాలు అదే రోజున ప్రకటిస్తారు.
రెండు జడ్పీటీసీ ఉపఎన్నికలతో జగన్‌కు కొత్త సవాళ్లు
పులివెందుల జడ్పీటీసీ మూడేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఒంటిమిట్ట జడ్పీటీసీగా గెలిచి జడ్పీ చైర్మన్ గా పదవి చేపట్టిన ఆకేపాటి అమర్నాత్ రెడ్డి రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దాంతో ఆయన జడ్పీటీసీగా రాజీనామా చేశారు. ఇప్పుడు ఈ రెండు స్థానాల్లో ఉపఎన్నిక అనివార్యమయింది. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటీసీలు మాత్రం జగన్ కు అత్యంత కీలకమైనవి. గతంలో పులివెందుల స్థానం ఏకగ్రీవం అయింది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. పులివెందులలో జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లోనూ వైసీపీ పోటీ చేయలేకపోయింది.
కుటుంబ సమస్యలపై పార్టీని ఏకతాటిపైకి ఉంచలేకపోతున్న జగన్
వైఎస్ కుటుంబంలో వచ్చిన చీలికలతో జగన్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి క్యాడర్ మొత్తాన్ని ఏకతాటిపై నడిపించలేకపోతున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి సోదరుడిగా..గతంలో కమలాపురం ఇంచార్జ్ గా పని చేసిన దుష్యంత రెడ్డి టీడీపీ నేతలతో కలసిపోయారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన అధికారికంగా టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అదే జరిగితే వైసీపీ అధినేత మరిన్ని చిక్కులు ఎదుర్కొంటారు. మరో వైపు షర్మిల వర్గం కూడా బలంగానే ఉంది. కుటుంబంలో ఓ వర్గం .. షర్మిలకు, సునీతగా మద్దతుగా ఉంటున్నారు.
పోటీ చేస్తారా.. వదిలేస్తారా ?
కడప జిల్లా అందులోనూ పులివెందుల నియోజకవర్గంలో ఏ చిన్న పదవిని టీడీపీకి కోల్పోయినా అదో పెద్ద సమస్య అవుతుంది. గత ఎన్నికల్లో మెజార్టీ తగ్గడంతో ..జగన్ పట్టు కోల్పోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.అయితే వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. పోటీ చేయకపోతేనే బెటరని. ఎలాగైనా టీడీపీ గెలవాలనుకుంటుందని పోటీ చేసి ఓడిపోతే .. సమస్యలు వస్తాయని అనుకుంటున్నారు. వచ్చే ఏడాది స్థానిక సంస్థలు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. అందుకే ఇప్పటికే వదిలేద్దామని వైసీపీ అనుకున్నా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.