Indian Sperm Tech Crime : విక్కీ డోనర్ అనే సినిమాలో ఓ యువకుడు వీర్యకణాలు ఆస్పత్రికి ఇస్తూ ఉంటాడు. ఇన్ ఫెర్టిలిటీ కేసులు పెరుగుతున్న సమయంలో ఇలాంటి విక్కీ డోనర్లు పెరిగిపోతున్నారు. తాజాగా సికింద్రాబాద్‌ లో ఇండియన్ స్పెర్మ్ టెక్ అనధికారంగా వీర్యకణాలు , అండాలను సేకరించి, వీటిని గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని ఫెర్టిలిటీ సెంటర్లకు రవాణా చేస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు.  ఈ నెట్‌వర్క్‌లో భాగంగా, సరోగసీ పేరుతో శిశువుల కొనుగోలు ,  విక్రయం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.  

వీర్యకణాల సేకరణ కోసం బిచ్చగాళ్లు, సామాన్య పౌరులను ఆకర్షించి, ఒక్కొక్కరికి రూ.4,000 వరకు చెల్లించారని, అంతేకాకుండా పోర్నోగ్రఫిక్ వీడియోలు చూపించి వీర్యం సేకరించినట్లు పోలీసులు గుర్తించారు.  అండాల సేకరణ కోసం మహిళలకు (ముఖ్యంగా అడ్డా కూలీలు) రూ.25,000 నుంచి రూ.50,000 వరకు చెల్లించారని ఆరోపణలు ఉన్నాయి.  ఈ పద్ధతులు అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ART) నిబంధనలను ఉల్లంఘించాయని, దాతలు మరియు స్వీకర్తల ఆరోగ్యానికి ప్రమాదం కలిగించాయని అధికారులు తెలిపారు.  రైడ్ సమయంలో 16 వీర్య నమూనాలతో పాటు, ఒక మహిళ  కు సంబంధించిన సరోగసీ దరఖాస్తు, దాతల వివరాలు, చెల్లింపు రికార్డులు, ఫైళ్లు స్వాధీనం  చేసుకున్నారు. 

 అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ART) యాక్ట్, 2021 సెక్షన్లు 21, 26, 27తో పాటు, సరోగసీ (రెగ్యులేషన్) యాక్ట్ ఉల్లంఘనల కింద కేసు నమోదైంది. ఈ రాకెట్‌లో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌తో సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఈ సెంటర్ యజమాని డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు జయంత్ కృష్ణతో సహా ఇతరులపై కూడా కేసు నమోదైంది.  ఇండియన్ స్పెర్మ్ టెక్ అహ్మదాబాద్‌లోని ఒక సంస్థతో సంబంధం కలిగి ఉందని, ఇది 2001 నుంచి స్పెర్మ్ బ్యాంక్ ,  రీప్రొడక్టివ్ సేవలను అందిస్తున్నట్లు చెబుతోంది.  ఈ సంస్థ హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం, కొండాపూర్, కోల్‌కతా, ఒడిశాలో కూడా శాఖలను నడుపుతున్నట్లు దర్యాప్తులో తేలింది. 

రైడ్ సమయంలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సంస్థ  యజమానిగా భావిస్తున్న పంకజ్ సోని (50), సంపత్ (42, క్యాషియర్), కె. శ్రీను (35, విశాఖపట్నం), జితేందర్ కుమావత్ (34, ఇండోర్), ఎల్. శివ (35), పి. మణికంఠ (25), కన్స్రీ బోరో (30, అస్సాం నుంచి అండ దాత) ఉన్నారు. ఇండియన్ స్పెర్మ్ టెక్ డిస్ట్రిక్ట్ రిజిస్టరింగ్ అథారిటీ లేదా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నుంచి అనుమతులు లేకుండా నడుస్తోంది. ఇది అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ART) రెగ్యులేషన్ యాక్ట్, 2021 మరియు సరోగసీ (రెగ్యులేషన్) యాక్ట్, 2021ని ఉల్లంఘించింది.                                

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్ చేసిన నిర్వాకంతో  ఇతర ఫెర్టిలిటీ సెంటర్ల మీద అనుమానాలు ప్రారంభమయ్యాయి. అందుకే ప్రభుత్వం అన్ని చోట్లా తనిఖీలు నిర్వహిస్తోంది.