ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ ప్యాకేజీని ప్రభుత్వం కల్పించిది. దీని వల్ల పలు అదనపు సౌకర్యాలు ఉద్యోగులకు దక్కనున్నాయి. ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత ఉద్యోగులకు దక్కిన అతి పెద్ద ప్రయోజనం ఇది. ఇప్పటి వరకూ పోలీసు శాఖలోనే ఈ కార్పొరేట్ శాలరీ ప్యాకేజీని అమలు చేస్తున్నారు. ఇక నుంచి ఆర్టీసీలో ఉన్న 50 పై చిలుకు ఉద్యోగులకు ఈ ప్యాకేజీ దక్కనుంది. ఈ ప్యాకేజీ కింద  ఉచిత ప్రమాద బీమా, శాశ్వత అంగవైకల్యం, సహజ మరణం సంభవించినప్పుడు భారీ పరిహారం లభిస్తుంది.   ఉద్యోగులు మరణిస్తే  వారి పిల్లల విద్యారుణాలు, ఆడపిల్లల వివాహ రుణాలను మాఫీ చేస్తారు.  


ప్రభుత్వంలో విలీనం కాక ముందు ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఇస్తున్నారు. ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత కూడా ఆ బ్యాంక్ ఆర్టీసీ ఉద్యోగుల శాలరీ ఖాతాలను తమ వద్దే కొనసాగించాలని కోరింది. ఇందు కోసం ప్రత్యేక కప్యాకేజీని ప్రకటించింది. కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ద్వారా అదనపు ప్రయోజనాలు కల్పించేందుకు సిద్ధపడింది.   ఆర్టీసీ ఉద్యోగులకు ప్రస్తుతం ఇస్తున్న బీమా సౌకర్యానికి అదనపు ప్రయోజనాలు చేకూర్చి, ఇందుకోసం ప్రభుత్వం ఎస్‌బీఐతో సంప్రదింపులు జరిపింది. ఆర్టీసీ ఉద్యోగి విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి రూ.40 లక్షల పరిహారం చెల్లిస్తారు. ఇప్పటివరకు ఈ పరిహారం రూ.30 లక్షలు ఉండేది. ఇప్పుడు రూ.10 లక్షలు పెంచారు. 


ప్రమాదంలో గాయపడి శాశ్వత వైకల్యానికి గురైతే రూ.30 లక్షల పరిహారం ఇస్తారు. వారి పిల్లల పేరిట రూ.5 లక్షల వరకు ఉన్న విద్యారుణాలు, ఆడపిల్లల వివాహాల కోసం చేసిన రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తారు. వీటికి ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఆర్టీసీ ఉద్యోగి సహజ మరణం పొందితే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం ఇస్తారు. దీనికి ఒక్కో ఉద్యోగి నెలకు రూ.200 బీమా ప్రీమియం చెల్లించాలి.  అంటే మొత్తంగా ప్రతి ఉద్యోగికి నెలకు రూ. రెండు వందల చొప్పున బీమా కు కడితే అనేక ప్రయోజనాలు లభిస్తాయి.


కరోనా కారణంగా ఆర్టీసీ తీవ్రమైన నష్టాల్లో ఉన్నప్పుడు ఉద్యోగులందర్నీ ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల వారికి నేరుగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగానే జీతాలు అందుతున్నాయి. ఆర్టీసీకి వస్తున్న ఆదాయంతో సంబంధం లేకుండా జీతాలు అందుతున్నాయి. దీంతో ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారు. అయితే పాత పెన్షన్‌తో పాటు మరికొన్ని డిమాండ్లు నెరవేర్చాలని వారు ప్రభుత్వాన్నికోరుతున్నారు.