Hyderabad to Chennai Bullet Train | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి, హైదరాబాద్ మధ్య బుల్లెట్‌ రైళ్లు పరుగులు తీయనున్నాయి. హైదరాబాద్‌- చెన్నై మధ్య హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ రైలు కారిడార్‌ నిర్మాణానికి సంబంధించిన ఎలైన్‌మెంట్‌కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ కారిడార్‌ అమరావతిని చేరుకుంటూ, సీఆర్డీయే (CRDA) మీదుగా వెళ్తుంది. ఇదే విధంగా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల మీదుగా వెళ్లే హైదరాబాద్‌- బెంగళూరు హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ఎలైన్‌మెంట్‌కూ ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ రెండు రైలు మార్గాల నిర్మాణంతో తెలుగు రాష్ట్రాల్లో ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది.

మెట్రో నగరాల మధ్య బుల్లెట్‌ రైళ్లు నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ కారిడార్లను నిర్మిస్తున్నది. ఈ ప్రాజెక్టులో భాగంగా, హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్ కారిడార్, హైదరాబాద్‌- బెంగళూరు కారిడార్లు ఏపీ మీదుగా వెళ్తాయి. ఈ రెండు కారిడార్లు ప్రారంభంలో హైదరాబాద్‌ నుంచి శంషాబాద్‌ వరకు 38.5 కిలోమీటర్ల వరకూ ఒకే మార్గంలో వెళ్తాయి. అనంతరం, చెన్నై, బెంగళూరు వైపుగా విడిపోయే వేర్వేరు మార్గాలుగా సాగుతాయి.

అమరావతి మీదుగా బుల్లెట్‌ రైలు పరుగులు...హైదరాబాద్‌- చెన్నై హైస్పీడ్‌ కారిడార్‌ కోసం 839.5 కి.మీ, 749.5 కి.మీ, 744.57 కి.మీలతో 3 ప్రతిపాదిత మార్గాలను పరిశీలించారు. వీటిలో అతి తక్కువ దూరమైన 744.5 కి.మీ. మార్గాన్ని ఎలైన్‌మెంట్‌కు ప్రాథమికంగా ఖరారు చేశారు. ఈ కారిడార్‌లో తెలంగాణలో 6, ఆంధ్రప్రదేశ్‌లో 8, తమిళనాడులో 1 స్టేషన్‌ నిర్మించనున్నారు. ఏపీలో ప్రతిపాదిత స్టేషన్లు అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడ ఉన్నాయి.

ఈ మార్గం హైదరాబాద్‌లో ప్రారంభమై అటు నుంచి శంషాబాద్, నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం/కోదాడ మీదుగా CRDA ప్రాంతానికి చేరుకుని, అక్కడి నుంచి గుంటూరు వైపు సాగుతుంది. గుంటూరు తర్వాత చీరాల వైపు వెళ్తూ, విజయవాడ - చెన్నై రైల్వే లైన్‌కు సమాంతరంగా చెన్నై వరకు వెళ్లేలా కారిడార్‌ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో అత్యధికంగా ఏపీలో 448.11 కి.మీ, తరువాత తెలంగాణలో 236.48 కి.మీ, తమిళనాడులో 59.98 కి.మీ మేర రైలు మార్గం ఉండనుంది.

ఈ కారిడార్‌ను తిరుపతి మీదుగా మళ్లిస్తే ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలుగుతుందని ప్రాథమికంగా చర్చ జరిగింది. గూడూరు నుంచి తిరుపతి మీదుగా మారిస్తే, కారిడార్‌ పొడవు అదనంగా 53.5 కి.మీ దూరం పెరుగుతుంది. ఈ మార్పుతో నాయుడుపేట, తడ స్టేషన్లు మార్గంలో ఉండకపోవచ్చు. మొత్తం హైస్పీడ్‌ ట్రాక్‌ నిర్మాణంలో డబుల్‌ ట్రాక్, లూప్‌లైన్లు, సైడింగ్స్‌ కలిపి మొత్తం 1,419.4 కి.మీ వరకు ట్రాక్‌ నిర్మించాల్సి ఉంటుంది.

హైదరాబాద్‌- బెంగళూరు కారిడార్‌హైదరాబాద్‌- బెంగళూరు హైస్పీడ్‌ కారిడార్‌కు సంబంధించి మూడు ప్రతిపాదిత మార్గాలు 621.8 కి.మీ, 576.6 కి.మీ, 558.2 కి.మీలను పరిశీలించారు. వీటిలో 576.6 కి.మీ మార్గం అత్యుత్తమంగా భావించి ఎలైన్‌మెంట్‌కు ప్రాథమికంగా ఆమోదం లభించింది. ఈ మార్గం ప్రస్తుత హైదరాబాద్‌- బెంగళూరు హైవేకి చాలావరకు సమాంతరంగా ఉంటుంది. ఈ కారిడార్‌లో తెలంగాణలో 4, ఆంధ్రప్రదేశ్‌లో 6, కర్ణాటకలో 3 స్టేషన్లు నిర్మించనున్నారు. ఏపీలో ప్రతిపాదిత స్టేషన్లు కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురం ఉన్నాయి. 

ఈ మార్గంలో తెలంగాణలో 218.5 కి.మీ, ఏపీలో 263.3 కి.మీ, కర్ణాటకలో 94.80 కి.మీ మేర రైలు మార్గం ఉంటుంది. డబుల్‌ లైన్‌, లూప్‌లైన్లు, సైడింగ్స్‌ కలిపి మొత్తం 1,363 కి.మీ మేర ట్రాక్‌ నిర్మించనున్నట్లు ఎలైన్‌మెంట్‌లో పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోని పెనుకొండ సమీపంలో ఉన్న కియా పరిశ్రమ, అనుబంధ పరిశ్రమల నేపథ్యంలో దుద్దేబండ వద్ద ప్రత్యేకంగా స్టేషన్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉంది.

గంట, రెండు గంటల్లోనే గమ్యస్థానానికి..హైదరాబాద్‌- అమరావతి- చెన్నై హై స్పీడ్ రైలు కారిడార్, హైదరాబాద్‌- బెంగళూరు మధ్య బుల్లెట్‌ రైళ్ల కారిడార్లు పూర్తవడంతో పాటు బెంగళూరు- చెన్నై మధ్య చేపట్టే బుల్లెట్‌ రైలు కనుక అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి అమరావతికి.. అమరావతి నుంచి చెన్నై, బెంగళూరు నగరాల మధ్య బుల్లెట్‌ రైళ్ల చతుర్భుజి ఏర్పాటు అవుతుంది. తద్వారా ఈ నగరాల మధ్య ప్రయాణం గంట నుంచి రెండు గంటల్లోనే పూర్తవుతుంది.