BTech Ravi challenges Avinash Reddy: పులివెందుల టీడీపీ ఇంఛార్జి బీటెక్ రవి.. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సవాలు విసిరారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నార్కో అనాలసిస్ పరీక్షకు అవినాష్ రెడ్డి రెడీనా అంటూ సవాలు విసిరారు. తాను ఆ టెస్టుకు రెడీ అని స్పష్టం చేశారు. వివేకా హత్య కేసు గురించి అధికార పార్టీకి చెందిన మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయని బీటెక్ రవి ఆరోపించారు. అందులో వచ్చిన కథనంపై బీటెక్ రవి స్పందించారు.


సోమవారం బీటెక్ రవి మీడియాతో మాట్లాడుతూ.. వివేకా హత్య కేసులో తన ప్రమేయం లేదని అన్నారు. అవసరమైతే నార్కో అనాలసిస్ టెస్టుకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు. వివేక కేసులో అవినాష్ కూడా నార్కో అనాలసిస్ పరీక్షకు సిద్ధమా అంటూ చాలెంజ్ చేశారు. ఆయనకు చేయబోయే టెస్టును లైవ్‌లో రాష్ట్రం మొత్తం చూసేలా ప్లాన్ చేయాలని సూచించారు. దమ్ముంటే అవినాష్ తన సవాలుకు ఒప్పుకోవాలని బీటెక్ రవి సవాలు విసిరారు. కేసు సీరియస్‌గా పట్టించుకుంటే అవినాష్ బీజేపీలోకి పోతాడని ఎద్దేవా చేశారు. వివేక హత్య జరిగిన రోజే గొడ్డలితో చంపిన విషయం ఎలా తెలిసిందో జగన్ సమాధానం చెప్పాలని బీటెక్ రవి డిమాండ్ చేశారు.