B Tech Ravi Arrest: పులివెందుల(Pulivendula) నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జి (TDP Incharge), మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి అలియాస్ బీటెక్ రవి (Btech Ravi)ని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. గతంలో నారా లోకేష్ (Nara Lokesh) వైఎస్సార్ జిల్లా పర్యటన (YSR District) సందర్భంగా కడప ఎయిర్ పోర్ట్ (Kadapa Airport) వద్ద పోలీసులపై బీటెక్ రవి దాడి చేసిన కేసులో అరెస్ట్ చేసినట్లు కడప డీఎస్పీ షరీఫ్ (DSP Sharif) తెలిపారు.
మంగళవారం రాత్రి డీఎస్పీ విలేకర్లతో మాట్లాడుతూ.. లోకేష్ పర్యటన సందర్భంగా విమానాశ్రయం వద్ద జరిగిన తోపులాటలో తమ ఏఎస్‌ఐకి గాయాలయ్యాయని తెలిపారు. దానిపై విచారణ చేపట్టి కేసు నమోదు చేసినట్లు వివరించారు. పది నెలలుగా బీటెక్ రవి అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు అరెస్టు చేశామని తెలిపారు.
అప్పుడు ఏం జరిగిందంటే?
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభించడానికి రెండు రోజుల ముందు జనవరి 25న కడపలోని దేవుని కడప ఆలయం, పెద్ద దర్గా సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలకడానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో బీటెక్ రవి కడప విమానాశ్రయం చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు.
దీంతో బీటెక్ రవి పోలీసులతో ఆయనకు వాగ్వాదానికి దిగారు. పోలీసులు, టీడీపీ కార్యర్తల మధ్య తోపులాట జరిగింది. ఘటనపై వల్లూరు పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. అంతేకాదు పోరుమామిళ్ల కేంద్రంగా భారీ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం చోటు చేసుకున్నట్లు వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయటంతో మొత్తం వ్యవహారం బీటెక్ రవి చుట్టూనే చేరింది.
యోగివేమన యూనివర్శిటీ సమీపంలో మంగళవారం సాయంత్రం పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఓ వాహనంలో బీటెక్ రవి ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు డ్రైవరు, గన్‌మెన్, ఇతర సహాయకుల ఫోన్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో బీటెర్ రవి, సెక్యూరిటీ, అనుచరుల ఫోన్లు పనిచేయక పోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు పార్టీ కీలక నేతల దృష్టికి తీసుకెళ్లారు.
ఆ తరువాత కొద్ది సేపటికి పోలీసులు బీటెక్ రవిని అదుపులోకి తీసుకున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. దాదాపు గంట తర్వాత పోలీసుల అదుపులో ఉన్న గన్‌మెన్, డ్రైవర్, వ్యక్తిగత సహాయకులను వదిలిపెట్టి అందరి ఫోన్లను తిరిగిచ్చారు. తర్వాత రవిని వల్లూరు పోలీసుస్టేషన్‌కు తరలించి అక్కడ నుంచి కడప ప్రభుత్వ సర్వజనాసుపత్రికి రాత్రి పది గంటలకు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం కడపలో జడ్జి ఎదుట హాజరుపరిచారు. నేడు (బుధవారం) ఉదయం హాజరు పరచాలని ఆదేశించారు.
పోరుమామిళ్లలో బెట్టింగ్ రాకెట్
వైఎస్సార్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ బెట్టింగ్, జూదంపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో స్థానికంగా పేరున్న లాడ్జిలను ఆయనే స్వయంగా తనిఖీలు చేశారు. బెట్టింగ్ అణిచివేతలో భాగంగా మూలాలపై దృష్టి సారించిన క్రమంలో పోరుమామిళ్ల కేంద్రంగా భారీ క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో పోలీసులు సమగ్ర దర్యాప్తులో బీటెక్ రవి కీలకంగా ఉన్నట్లు తేల్చారు. ఆయన కనుసన్నుల్లో నడిచినట్లు నిర్ధారించారు.
పోలీసులకు పక్కా ఆధారాలు దొరకటంతో బీటెక్ రవి తప్పించుకొని తిరుగుతున్నట్లుగా సమాచారం తెలియవచ్చింది. ఈ క్రమంలోనే యోగివేమన యూనివర్శిటీ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో బీటెక్ రవి ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంపై నోటీసులు జారీ చేసి, విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.