Joint Capital BRS Reaction :  హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది.  వైవీ సుబ్బారెడ్డి,పెద్దిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని  మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.  హైదరాబాద్ ను ఏపి రాజధానిగా కొనసాగించాలనే ఆయన డిమాండ్ హాస్యాస్పదమన్నారు.  ఆ వ్యాఖ్యలు విభజన చట్టానికే విరుద్ధమని స్పష్టం చేశారు.  కేసిఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు ఆ నాయకుల నుండి ఈ మాటలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.  ఇప్పుడు మాట్లాడుతున్నారంటే...ఇక్కడి ప్రభుత్వ ఉదాసీన వైఖరితోనేనన్నారు.  ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వారికి వంత పాడెలా ఉన్నదన్నారు.  కేసిఆర్ తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు...ఎప్పటికీ తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ పడేది లేదన్నారు.  తెలంగాణకు అన్యాయం జరిగితే బిఆర్ఎస్ పార్టీ,కేసిఆర్ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.  రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి అనే మేము కోరుకుంటున్నాం..మీ రాష్ట్రాన్ని మంచిగా పాలించుకుంటూ అభివృద్ధి చెందండి..కానీ మీ రాజకీయాల కోసం తెలంగాణ జోలికి రావొద్దని హెచ్చరించారు. 


వైవీ సుబ్బారెడ్డి ఏమన్నారంటే ?


విశాఖ రాజధానిగా వచ్చేంత వరకు ఏపీకి కూడా హైదరాబాద్ రాజధానిగా కొనసాగితే బాగుంటుందని  వైవీ సుబ్బారెడ్డి అన్నారు.   గత ప్రభుత్వంకూడా అమరావతిలో తాత్కాలిక రాజధానినే నిర్మించారని, రాజధాని నిర్మించే స్థోమత ప్రస్తుతం ఏపీలో లేదని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖను పరిపాలన రాజధానిగా అనుకున్నాం.. కానీ, దానిపై న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. న్యాయపరమైన చిక్కులు ఎప్పుడు వీడుతాయో తెలియదు.. ఎన్నికల తర్వాత జగన్ మోహన్ రెడ్డి దానిపై వివరణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. విశాఖ రాజధాని అయ్యేంత వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగాలని నా భావన అని సుబ్బారెడ్డి అన్నారు.


ఎన్నికల ముందు నుంచే విశాఖపట్టణం రాజధానిగా పాలన చెయ్యడానికి సిద్ధం ఉన్నాం.. కానీ, న్యాయపరమైన చిక్కుల కారణంగా ఆ పని సాధ్యం కాలేదు. సీఎం జగన్ వచ్చి పరిపాలన చెయ్యాలంటే ఇక్కడి నుంచి చేస్తారు. కానీ, ఇక్కడ ఉద్యోగులు గురించి ఆలోచించాలి. ఈరోజుకీ హైదరాబాద్ నుంచే ఉద్యోగులు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. మనకంటూ ఓ రాజధాని లేదు.. విశాఖ రాజధానిగా న్యాయపరమైన చిక్కులు లేకుండా పరిపాలన సాగించే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గత ప్రభుత్వం వైఫల్యం కారణంగా రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని విమర్శించారు. ఒక్కరోజులో విశాఖను రాజధానిగా తరలించలేము.. సీఎం ఒక్కడే ఉంటే సరిపోదు.. దానికి సంబంధించి సీఎంతో పాటు ఉద్యోగులు, అధికారులు రావాలి. వారికి సౌకర్యాలు కల్పించాలి. అందుకే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లో ఉండాలని కోరుతున్నాము. మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే.. వచ్చే చట్టసభల్లో దీనిపై పోరాటం చేస్తామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.


వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణలోనూ కలకలం 


విభజన  చట్టం ప్రకారం పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. ఆ తర్వాత ఎవరి రాజధాని వారికే ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ ను రాజధానిగా ఉమ్మడిగా కొనసాగించాలంటే.. విభజన చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది.