Brother For Sister : చెల్లికి అన్యాయం జరిగింది. న్యాయం కోసం ఆ అన్న ఏం చేశాడు ? అన్న సింగిల్ పాయింట్ లైన్‌తో వచ్చిన సినిమాలో కోకొల్లలు. అలాంటి సినిమాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. ఎందుకంటే చెల్లి అంటే ఎవరికైనా అంత ప్రేమ ఉంటుంది. ఆ అనుబంధాన్ని ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది. అయితే నిజ జీవితంలో సినిమా కథల్లోలా అన్యాయం జరిగిన చెల్లి కోసం పోరాడే అన్నలు తక్కువగా ఉంటారు. ఎందుకంటే జీవితం సినిమా కాదు. కానీ ఓ అన్న మాత్రం తన చెల్లికి జరిగిన అన్యాయం కోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధపడ్డారు. బయలుదేరారు కూడా. 


ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ల గ్రామంలో నేలవెల్లి నాగ దుర్గారావు తల్లి, సోదరితో కలిసి నివసిస్తున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న చెల్లి నవ్యతను ముప్పాళ్ల మండలంలోనే చందాపురం గ్రామానికి చెందిన కొంగర నరేంద్రనాథ్ అనే యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. 2018లో పెళ్లి ఘనంగా చేశారు. 23 లక్షలకు పైగా నగదు.. మూడు ఎకరాల పొలం.. 320 గ్రాముల బంగారం కూడా ఇచ్చారు. అయితే నరేంద్రనాథ్ సంసారం సరిగ్గా చేయలేదు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తూండటంతో పాటు నవ్యతను శారీరకంగా హింసించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలుమార్లు గొడవలు జరిగాయి. కానీ పెద్దలు సర్ది చెప్పారు. 


అయితే నరేంద్రనాథ్ తల్లిదండ్రులు.. నవ్యత ఎక్కడ తమపై తిరగబడుతుందోనని  బెదిరించి తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. ఆ తర్వాత ఇంకా వేధింపులు ఎక్కువ చేశారు. చివరికి అవి భరించలేక నవ్యత పుట్టించికి వచ్చేసింది. జరిగిన ఘటన గురించి చందర్లపాడు పోలీస్ స్టేషన్‌లో  ఫిర్యాదు చశారు. కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.   నవ్యత అత్తమామలు తమ పరపతి ఉపయోగించడంతో కేసులో ఎలాంటి పురోగతీ లేకపోయింది.


చూసీ చూసీ ఇక విసిగి వేసారిపోయిన నాగ దుర్గరావు ఢిల్లీకి వెళ్లి సుప్రీంకోర్టుతో పాటు హెచ్చార్సీలోనూ ఫిర్యాదు చేయాలనుకున్నారు. అయితే తన సోదరికి జరిగిన అన్యాయం గురించి అందరికీ తెలియడానికి ఆయన వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు.  తన తల్లితో కలిసి ఎడ్లబండిపై ఢిల్లీ చేరుకుని సుప్రీంకోర్టు, హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన బయలుదేరారు. నందిగామ మండలం నుంచి బయలుదేరి.. ఖమ్మం జిల్లా బోనకల్ గ్రామానికి చేరుకున్నారు. ఆ సోదరుడి యాత్ర అలా సాగుతోంది. ఆయన గురించి.. ఆయన ప్రయత్నం గురించి తెలిసిన వారు.. వచ్చి సంఘిభావం చెప్పి ఖచ్చితంగా తన సోదరికి న్యాయం జరుగుతుందని ధైర్యం చెబుతున్నారు. 


కొద్ది రోజుల క్రితం  నాగ దుర్గారావు తన చెల్లికి న్యాయం కోసం కృష్ణానదరిలో కూడా కుటుంబసభ్యులతో కలిసి నిరనసకు దిగారు.