Borugadda Anil: వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కుటుంబాన్ని, పవన్ కల్యాణ్ కుటుంబాన్ని ద్వేషిస్తూ, వారి కుటుంబంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడతానని హెచ్చరికలకు పాల్పడిన బోరుగడ్డ అనిల్ హైకోర్టులో తప్పుడు పత్రాలు సమర్పించి బెయిల్ పొందారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన కనిపించకుండా పోయారు. చెన్నై ఆస్పత్రిలో తన తల్లి చికిత్స పొందుతున్నారని చూసుకోవాలని బెయిల్ తీసుకున్నారు. కానీ ఆయన చెన్నై వెళ్లలేదని గుర్తించారు. ఈ క్రమంలో ఆయన హైకోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు కూడా తప్పుడువని తేలడంతో పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో బోరుగడ్డ అనిల్ ఓ వీడియో విడుదల చేశారు.
తల్లిని చూసుకునేందుకే మధ్యంతర బెయిల్ తీసుకున్నానన్న బోరుగడ్డ అనిల్
తన తల్లికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందని ఆమెను చూసుకోవడానికే తాను మధ్యంతర బెయిల్ తీసుకున్నానని అంటున్నారు. హైకోర్టును తాను తప్పుదోవ పట్టించానని.. తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చానని జరుగుతున్నప్రచారం అంతా అవాస్తవం అన్నారు. కోర్టును తాను ధిక్కరించబోనన్నారు. చంద్రబాబు, లోకేష్ తనను టార్గెట్ చేస్తున్నారని .. తనకేదైనా జరిగితే వారిదే బాధ్యతన్నారు. తనకు బెయిల్ రాకుండా.. చాలా కఠినమైన సెక్షన్లు పెట్టారని అవి తనకు వర్తించవని అన్నారు. తనకు జగనే తండ్రి అని చెప్పుకొచ్చారు. హైకోర్టు వారు కూడా పరిశీలించి తనపై వచ్చిన ఆరోపణలను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు.
బోరుగడ్డ అనిల్ ఎక్కడున్నారో వెదుకుతన్న పోలీసులు
పోలీసులకు ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ అందుబాటులో లేరు. ఆయనకు చెందిన ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. అనంతపురం పోలీసులు చెన్నై అపోలోఆస్పత్రికి వెళ్లారు. ఆయన తల్లి చికిత్స పొంది డిశ్చార్జ్ కూడా అయ్యారని .. అయితే మధ్యంతర బెయిల్ పొందిన ఆయన మాత్రం చెన్నైరాలేదని గుర్తించారు. ఆస్పత్రిలో కూడా లేరని సీసీ ఫుటేజీలు చూసి పరిశీలించారు. రెండో సారి కూడా మధ్యంత బెయిల్ పొందడానికి గుంటూరులో ఓ ప్రముఖ ఆస్పత్రి డాక్టర్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేయడంతో ఆయన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో పోలీసులకూ తెలియడం లేదు.
మధ్యంతర బెయిల్ ఐపోగానే లొంగిపోతారా.. పారిపోతారా ?
హైకోర్టును సైతం మోసగించడంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో వీడియో విడుదల చేయడం సంచనలంగా మారింది. ఆయనకు కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ఇంకా ఉంది. ఆ గడువు సమయానికి వచ్చిలొంగిపోతారా లేకపోతే.. పారిపోతారా అన్నది తెలియాల్సి ఉంది. బోరుగడ్డ అనిల్ పై ఇప్పటికే లుకౌట్ నోటీసులు ఉన్నాయి. విదేశాలకు పారిపోయే అవకాశం లేదని భావిస్తున్నారు. వీడియో రిలీజ్ చేశారు కాబట్టి దాని ఆధారంగా ఎక్కడ ఉన్నారో కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.