Bonda Uma made a key tweet on Pawan Kalyan: అసెంబ్లీలో బొండా ఉమ పవన్ కల్యాణ్ అందుబాటులో ఉండటం లేదంటూ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఇది అనూహ్యమైన రాజకీయ అంశంగా మారడంతో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ వెంటనే సర్దుబాటు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ నాయకత్వాన్ని పొగుడుతూ ఓ ట్వీట్ పెట్టారు. అసెంబ్లీలో ప్రస్తావించిన సమస్యను విని తక్షణమే స్పందించి పరిష్కరించిన పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనమన్నారు. సమస్యను పరిష్కరిస్తామని పవన్ చేసిన ట్వీట్ కు బొండా ఉమ ఇలా స్పందించారు.
అసలేం జరిగిందంటే ?
అసెంబ్లీలోకాలుష్య నియంత్రణ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న కృష్ణయ్య పని తీరుపై బొండా ఉమా ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేల లెటర్స్‌ను కూడా తిరస్కరిస్తున్నారు. సమస్య ఉందని చెబితే చర్యలు కూడా తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇలాంటి వాళ్లను ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సరిదిద్దాలని సూచించారు. ఈ క్రమంలో పవన్ అందబాటులో ఉండటం లేదన్నారు. పవన్ కల్యాణ్ వెంటనే తాను అందుబాటులో ఉండటం లేదన్నది వాస్తవం కాదన్నారు. దీనిపై ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను సరి చేసుకోవాలని సూచించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సాధారణంగా ప్రజలతో సంబంధాలు తక్కువగా ఉంటాయని కానీ కృష్ణయ్య ఛైర్మన్ అయ్యాకే పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. తాను కానీ, కృష్ణయ్య కాని అందుబాటులో ఉంటున్నామని పేర్కొన్నారు. పొలూష్యన్ కంట్రోల్ పేరుతో పరిశ్రమలను భయపెట్టే పరిస్థితి ఉండకూడదని అన్నారు. అలా చేస్తే ఒక్క పరిశ్రమ కూడా ఉండబోదని అభిప్రాయపడ్డారు. అదే చేస్తే గత ప్రభుత్వానికి కూటమి సర్కారుకు తేడా ఏంటని ప్రశ్నించారు.
ఈ అంశం జనసైనికుల్ని ఆగ్రహానికి గురి చేసింది. పవన్ కల్యాణ్‌పై నిందలు వేశారని బొండా ఉమపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది రాను రాను పెరిగిపోవడంతో బొెండా ఉమ అప్రమత్తమయ్యారు. కూటమిపార్టీల పెద్దలు కూడా బొండా ఉమ మాట్లాడిన వైనాన్ని తప్పు పట్టినట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ సీఎం అందుబాటులో లేకపోవడం ఏమిటని .. ఆయనను కలిసేందుకు ఎప్పుడు ప్రయత్నించారు.. ఎప్పుడు ఆయన కలవలేదో చెప్పమని ఆగ్రహించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంలో వివాదానికి పుల్ స్టాప్ పెట్టాలని బొండా ఉమ నిర్ణయించుకోవడంతో.. సమస్య పరిష్కారం అయిందని.. పరిష్కరించిన పవన్ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ పెట్టినట్లుగా తెలుస్తోంది.