Boats Removal Operation In Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. పలు ప్రయత్నాల అనంతరం మంగళవారం ఒక బోటును అధికారులు బయటకు తీయగలిగారు. ఇంకా ఉన్న బోట్లను తొలగించేందుకు వరుసగా తొమ్మిదో రోజు సైతం ఇంజినీర్లు, అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉన్న అవకాశాలన్నింటినీ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం రెండు పెద్ద బోట్లు, ఓ చిన్న బోటు నీళ్లలో ఇరుక్కున్నాయి. వీటిని తీయడం సవాల్‌గా మారగా.. ఉదయం నుంచి సగం నీటిలో తేలుతోన్న రెండో బోటును సవ్య దిశగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా చేస్తేనే తప్ప బోటు కదిలించే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో జేసీబీ సాయంతో 200 మీటర్ల దూరం నుంచి తాడు ద్వారా దిశను మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా బోట్లను తొలగించేందుకు శ్రమిస్తున్నామని.. త్వరలోనే ఆపరేషన్ పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ జరిగింది
ఇటీవల భారీ వర్షాలు, వరదలతో ఈ నెల 2న ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతిలో 4 బోట్లు కొట్టుకొచ్చి వంతెన గేట్లను ఢీకొన్నాయి. దీంతో 67, 68, 69 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు దెబ్బతినగా.. మరమ్మతులు చేపట్టిన ఇంజినీరింగ్ నిపుణులు.. రిటైర్డ్ ఇంజినీర్ కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో 5 రోజుల్లోపే కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేశారు. అయితే, బోట్లు తొలగించే ప్రక్రియ మాత్రం కొలిక్కి రాలేదు. తొలుత బోట్లను కోసి వాటిని భాగాలుగా చేసి ఒడ్డుకు చేర్చాలని భావించారు. అయితే, అది సాధ్యం కాలేదు. గత 6 రోజులుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో భారీ పడవలు, క్రేన్ల సాయంతో వాటిని ఒడ్డుకు చేర్చేలా ప్రణాళిక రచించారు. ఒక్కొక్కటి 50 టన్నుల సామర్థ్యం గల రెండు బోట్లను తెప్పించి వాటిని ఇనుప గడ్డర్లతో అనుసంధానించి.. క్రేన్ల సాయంతో వాటిని బయటకు తీసేలా ప్లాన్ చేశారు. ఎట్టకేలకు ఒక బోటును మాత్రం వెలికితీయగలిగారు. చివరకు మిగిలిన బోట్లను సైతం వెలికితీసేలా చర్యలు చేపట్టారు.
అటు, ఈ ఘటనపై ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో కుట్రకోణంపై పోలీసులు విచారించారు. డ్యాంను ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు, కార్యకర్తలవేనని నిర్ధారించిన పోలీసులు.. వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుల బోట్లుగా గుర్తించినట్లు నివేదికలో వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించారు. ఆ బోట్లు ఉషాద్రి, కర్రి నరహింహా స్వామి, గూడూరు నాగమల్లీశ్వరిలకు చెందినవిగా గుర్తించారు. సాధారణంగా మూడింటిని కలిపి కట్టరని.. వాటికి ఇనుప చైన్ల లంగరు వేయకుండా ప్లాస్టిక్ తాళ్లతో కట్టేసినట్లు పేర్కొన్నారు. తమ బోట్లతో పాటు సమీపంలోని మరో రెండింటిని కూడా కొట్టుకెళ్లేలా కుట్ర చేశారని నివేదికలో తెలిపారు. బోట్ల ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారేజీని కూల్చడం ద్వారా 10 లక్షల మందికిపైగా ప్రజల్ని రిస్కులో పెట్టాలనుకున్నారని.. ఇది దేశద్రోహమేనని మండిపడ్డారు.
Also Read: Balineni : జగన్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చిన బాలినేని - వైసీపీకి రాజీనామా - రేపో మాపో జనసేనలో చేరిక !