Minister Jupally Krishna Rao: నాగర్ కర్నూల్ కొల్లాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా దవాఖానలో సూపరింటెండెంట్, ఇతర డాక్టర్లు డ్యూటీకి రాలేదని గుర్తించిన మంత్రి జూపల్లి, వారి గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షో కాజ్ నోటీసులు జారీ చేసి వారి నుంచి వివరణ తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి (DMHO) డాక్టర్ స్వరాజ్యలక్ష్మిని మంత్రి ఆదేశించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుంటే వైద్యులు, సిబ్బంది విధులను సక్రమంగా నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించడం సమంజసమేనా అని ప్రశ్నించారు. సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ సందర్భంగా పలువురు పేషెంట్లతో మంత్రి జూపల్లి మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. డాక్టర్లు, నర్పులు సరియైన సమయానికి రావటం లేదని, తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని మంత్రికి వివరించారు. వైద్యలు, సిబ్బంది సమయ పాలన పాటిస్తూ.. రోగులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందజేసే బాధ్యత మనపై ఉందని డాక్టర్లు, నర్సులతో అన్నారు.
అనంతరం దవాఖానలోని పలు విభాగాలను పరిశీలించారు. దవాఖానకు వస్తున్న పేషెంట్లు వివిధ విభాగాలను తెలిగ్గా గుర్తించేలా సైన్‌బోర్డులు పెట్టాలని సూచించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. త్వరలో ఆసుపత్రి అభివృద్ధిపై కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ. 25 లక్షలు కేటాయించనున్నట్లు మంత్రి వెల్లడించారు.