BJP Wanted  Eleventh seat in AP :   ఏపీలో భారతీయ జనతా పార్టీ మరో సీటు కోసం పట్టుబడుతున్నట్లగా తెలుస్తోంది. ఇప్పటికి పది అసెంబ్లీ సీట్లను కేటాయించారు. వాటిలో అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియలో ఉన్నారు. అయితే పార్టీ నేతల నుంచి టిక్కెట్ల కోసం ఒత్తిడి పెరిగిపోవడంతో మరో సీటును కేటాయించాలని టీడీపీని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఏపీకి ఎన్నికల ఇంచార్జ్ గా బీజేపీ సీనియర్ నేత అరుణ్ సింగ్ వచ్చారు. ఆయన నేతృత్వంలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  అరుణ్ సింగ్.. బీజేపీ పదకొండు స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. అయితే ఆ పదకొండో స్థానం ఏమిటో చెప్పలేదు. కడప జిల్లాలోనే మరో స్థానం కోరుతున్నట్లుగా చెబుతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట లేదా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని బీజేపీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. 


బీజేపీ ప్రతిపాదనలపై టీడీపీ స్పందన ఎలా ఉందో స్పష్టత లేదు. ఇప్పటికే కడప జిల్లాలో ఓ సీటు జనసేనకు..మరో సీటు బీజేపీకి ఇచ్చినందున మరో సీటు ఇచ్చే అవకాశం లేదని సమాధానం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. పదాధికారుల భేటీలో ఎన్నకిల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు.  బుధవారం  సాయంత్రంలోగా ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి.  పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం పని చేయాలని కిందిస్థాయి నేతలకు అగ్ర నేతలు దిశా నిర్దేశనం చేశారు.  పార్టీ కోసం పని చేసిన నేతలకు అవకాశాలు రాకున్నా బాధపడొద్దని ముఖ్య నేతలు చెబుతున్నారు. పొత్తులో భాగంగా త్యాగాలు తప్పవని బుజ్జగిస్తున్నారు. టికెట్లు దక్కకపోయినా పార్టీ అందరి సేవలనూ గుర్తు పెట్టుకుంటుందని పార్టీ పెద్దలు భరోసా కల్పిస్తున్నారు. కలిసికట్టుగా పని చేసి విజయం సాధించాలని కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు.
 
ఇక వచ్చే నెల 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప్రచారాన్ని చేపట్టనుంది. ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి ఎంపీగా బరిలోకి దిగుతున్న రాజమండ్రి నుంచే ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. పార్టీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు ప్రచారసభల్లో పాల్గొనేలా టూర్ షెడ్యూల్స్‌ను ఖరారు చేస్తున్నారు. వీటితో పాటు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిపి ఉమ్మడి బహిరంగ సభలు కూడా ఎక్కడెక్కడ నిర్వహించాలనే దానిపై ఆలోచన చేస్తున్నారు. నియోజకవర్గాలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకునేలా ట్రైనింగ్‌ ఇస్తున్నారు. పోటీ చేయబోయే నియోజకవర్గాలకు ప్రత్యేకంగా కొన్ని టీమ్‌లను ఎంపిక చేయనున్నారు. బీజేపీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న సీనియర్లకు, నియోజకవర్గంపై పట్టున్న లీడర్లకు ప్రచార బాధ్యతలు అప్పగించనున్నారు.


పదాధికారుల భేటీకి సీనియర్ నేతలు  విష్ణువర్ధన్  రెడ్డి, సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు వంటి వారు హాజరు కాలేదు. పోటీ చేసే సీట్లు దక్కనందునే వారు హాజరు కాలేదని తెలుస్తోంది. అయితే సోము వీర్రాజుకు అవకాశం కల్పించేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. రాజమండ్రి రూరల్ లేదా అర్బన్ సీట్లలో ఒకటి కేటాయించాలని అడుగుతున్నారని చెబుతున్నారు. కానీ ఇప్పటికే టీడీపీ అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు.