GVL Narasimha Rao to contest in Visakhapatnam :  లోక్‌సభ ఎన్నికల్లో  విశాఖ నుంచి పోటీకి బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రయత్నాలు చేస్తున్నారు. యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక అయిన  జీవీఎల్‌కు  బీజేపీ హైకమాండ్ మరోసారి పొడిగింపు ఇచ్చే అవకాశం లేదు. దీంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేాయలనుకుంటున్నారు. ఏప్రిల్‌లో ఆయన పదవీ కాలం పూర్తవుతుంది. పార్లమెంట్ లో అడుగు పెట్టాలంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఆయన విశాఖను ఎంచుకుని గత రెండేళ్లుగా రాజకీయాలు చేస్తున్నారు. 


బీజేపీలో ప్రాధాన్యం తగ్గిపోయిన జీవీఎల్ 
 
ఏపీకి చెందిన జీవీఎల్ ఎక్కువగా ఉత్తరాదిలోనే గడిపారు. చదువులు కూడా అక్కడే సాగాయి.  ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న జీవీఎల్  చాలా కాలంగా బీజేపీలోకి కొనసాగుతున్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా పని చేశారు.   2018 మార్చిలో ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపింది. తర్వాత ఆయనకు అధికార ప్రతినిధిగా కూడా పదవి తీసేశారు. జాతీయ స్థాయిలో ఆయనకు ప్రస్తుతం ఎలాంటి హోదా లేదు .. కేవలం ఎంపీగానే ఉన్నారు. అధికార ప్రతినిధిగా కూడా లేకపోవడంతో ఆయన మాటల్ని ఎవరూ పట్టించుకోడం లేదు. 


చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్ షర్మిల - ఉరవకొండలో వైఎస్ జగన్ విమర్శలు !


విశాఖలో పోటీకి ఆసక్తి


ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు .. టీడీపీపై ఎక్కువగా విమర్శలు చేసేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా స్పందించడంలేదు.కానీ గత రెండేళ్లుగా ఆయన విశాఖపై దృష్టి పెట్టారు. బీజేపీ కార్యక్రమాలతో పాటు తన సొంత ఎజెండాతో మరికొన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల సంక్రాంతి సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల సీఎస్ఆర్ ఫండ్స్ తో వీటిని నిర్వహించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. 


పొత్తు  ఉంటుందని నమ్మకమా? 


అసలు జీవీఎల్ విశాఖనే ఎందుకు ఎంచుకున్నారు అనేదే ఇప్పుడు చర్చల్లో నలుగుతోంది. ముఖ్యంగా 2014 ఎన్నికల్లాగే ఈ సారి టీడీపీతో పొత్తులు ఉంటాయని ఆ స్థానం కేటాయిస్తారని ముందుకు కర్చీఫ్ వేసుకునేందుకు జీవీఎల్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. నిజానికి విశాఖ నుంచి గతంలో రెండు సార్లు పురందేశ్వరి గెలిచారు. పోటీ చేయాలనుకుంటే పురందేశ్వరి పోటీ చేస్తారు. జీవీఎల్‌కు విశాఖకు ఎలాంటి సంబంధం లేదు. అయినా జీవీఎల్ ముందస్తు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే ఏం చేస్తారో కానీ ఇప్పుడు మాత్రం హడావుడి బాగానే చేస్తున్నారని అంటున్నారు. 


జగన్ అన్నయ్య గారూ... సుబ్బారెడ్డిగారు ఏపీ అభివృద్ధి చూపిస్తారా? రాజధాని ఎక్కడండీ?


వైసీపీ తరపున బొత్స  ఝాన్సీ పోటీ  - టీడీపీ తరపున భరత్ పోటీ  
  
 ఇప్పటికే వైసీపీ ఉత్తరాంధ్రకు చెందిన మాజీ ఎంపీ బొత్స ఝాన్సీని ఎంపీ అభ్యర్దిగా ప్రకటించింది. బొత్స ఝాన్సీ రాజకీయ నేపథ్యం, భర్త బొత్స సత్యనారాయణ మంత్రి కావడం, ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో హైకమాండ్ చాన్స్ ఇచ్చారు.  మరోపక్క టీడీపీ నుండి గత ఎన్నికల్లో పోటీ చేసిన విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు, బాలకృష్ణ చిన్నల్లుడు అయిన భరత్ రెడీగా ఉన్నారు. ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కూడా విశాఖ నుంచే పోటీ చేయబోతున్నారు.