ఎన్నికల్లేకపోయినా పొత్తులు పెట్టుకున్నారు. కలసి పని చేయాలని నిర్ణయించుకున్నారు. ఏదైనా కలిసి చేస్తామని మాట్లాడుకున్నారు. సమన్వయ కమిటీలనూ నియమించుకున్నారు. కానీ ఇప్పుడు ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు. ఆ పార్టీలే జనసేన, బీజేపీ. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులో ఉన్న పార్టీలు బీజేపీ - జనసేన. ఉమ్మడి పోరాటాల ద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రజలను మెప్పించి అధికారం చేపట్టాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు పాడైపోయిన రోడ్ల విషయంలో జనసేన ఒక్కటే ఒంటరిగా పోరాటానికి సిద్ధమైంది. ఎక్కడా బీజేపీ ప్రస్తావన రావడం లేదు. బీజేపీ కూడా ఈ అంశంపై స్పందించడం లేదు.


రెండు వారాల కిందటే కలిసి పోరాటాలు చేయాలని బీజేపీ-జనసేన నిర్ణయం !

జూలైలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా రోజుల తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీసుకు వచ్చారు. అప్పుడు బీజేపీ నేతలు పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు. ఆ తర్వాత ఆగస్టు 14వ తేదీన బీజేపీ, జనసేన ముఖ్య నేతలు సమావేశమయ్యారు. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, సోము వీర్రాజు, కన్నా లక్ష్మినారాయణ, సునీల్ ధియోధర్ లాంటి ఇరు పార్టీల అగ్రనేతలు హాజరయ్యారు. ఇరు పార్టీలు ఉమ్మడిగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలపై ఉమ్మడి పోరాటం చేయాలని మాట్లాడుకున్నారు. ఇది జరిగి రెండు వారాలు కాక ముందే జనసేన పార్టీ సొంత కార్యాచరణ ప్రకటించింది జేఎస్పీ ఫర్ ఏపీ రోడ్స్ పేరుతో ప్రభుత్వంపై ఉద్యమం చేయాలని నిర్ణయించుకుంది.


జనసేన కలుపుకోవడం లేదా..?  బీజేపీ కలవడం లేదా..? 


ఏపీలో రోడ్ల పరిస్థితిని మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోల ద్వారా బయట పెట్టాలని జనసేన నిర్ణయించింది.  బీజేపీని కలుపుకుకుని పోవాలని ఒక్క సారి కూడా ఆలోచించలేదు. సొంతంగా కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. పొత్తులో భాగంగా రాజకీయంగా చేపట్టే కార్యక్రమాలను సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించుకుని..  కలసికట్టుగా చేయాలన్న తీర్మానాన్ని పట్టించుకోలేదు. అయితే  బీజేపీనే ఆసక్తి చూపకపోవడం వల్ల పవన్ కల్యాణ్ సొంత కార్యాచరణ ప్రకటించారన్న అభిప్రాయం జనసేన వర్గాల్లో ఉంది.  ఇటీవలి కాలంలో బీజేపీ కొన్ని పోరాటాలు చేసింది కానీ అప్పుడు జనసేనకు సమాచారం ఇవ్వలేదు. ఉద్యోగ క్యాలెండ్‌పై బీజేపీ దీక్షలు చేసింది...కానీ జనసేనతో కాదు.


ఏపీ బీజేపీ నేతలపై పవన్‌కు నమ్మకం లేదా..!?


స్థానిక ఎన్నికల్లో బీజేపీ- జనసేన కలిసి పోటీ చేశాయి. తర్వాత తిరుపతి ఉపఎన్నికల్లో కూడా పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేసింది. అక్కడ్నుంచి జనసేన అభ్యర్థిని నిలబెట్టాలని అనుకున్నా బీజేపీ ఒత్తిడితో ఆ పార్టీకే కేటాయించాల్సి వచ్చింది. కానీ బీజేపీ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. బీజేపీ కేంద్ర నాయకత్వంపై పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో సానుకూలతతో ఉన్నారు. కానీ రాష్ట్ర నాయకత్వం విషయంలో మాత్రం ఆయనకు అభ్యంతరాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. కారణం ఏదైనా కానీ పొత్తుల్లో ఉన్న పార్టీలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడంతో రెండు పార్టీల క్యాడర్‌కూ గందరగోళంగా మారింది.