Andhra BJP Election Alliances:  ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కానీ రాజకీయ పార్టీల మధ్య పొత్తుల అంశం ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. అధికార వైసీపీ నేరుగా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా బీజేపీ జాతీయ నేత తరుణ్ చుగ్.. ఈ అంశంపై పార్టీ నేతలతో మాట్లాడేందుకు విజయవాడ వచ్చారు. 


ఏపీలో రాజకీయ వ్యూహాలను కొలిక్కి తేవాలనుకుంటున్న బీజేపీ హైకమాండ్                        


 ఎన్నికలు దగ్గర పడటంతో  ఏపీ వ్యవహరాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది.. పొత్తులపై వీలైనంత త్వరగా క్లారిటీకి రావాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది.. దీనికోసం  బీజేపీ జాతీయ నేత తరుణ్ చుగ్ ను ప్రత్యేకంగా పంపుతున్నారు. గురువారం జరిగే బీజేపీ ఏపీ కోర్ కమిటీ భేటీకి హాజరుకానున్నారు తరుణ్ చుగ్. అంతకు ముందే పదాధికారుల సమావేశం వివరాలు.. పొత్తులపై నేతల అభిపప్రాయాలను తరుణ్ చుగ్‌కు ఏపీ బీజేపీ ముఖ్యనేతలు వివరించనున్నారు.


పదాధికారుల భేటీలో అభిప్రాయాల సేకరణ              


జేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి నేతృత్వంలో పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం నిర్వహిస్తున్నారు.. ఎన్నికల ముందు సమావేశం కావడంతో పొత్తులు, ఎన్నికల వ్యూహలపై కీలకంగా చర్చించనున్నారు.. పొత్తులపై నేతల నుంచి అభిప్రాయాలు స్వీకరించనున్నారు పార్టీ పెద్దలు. టీడీపీతో కలిసి వెళ్లాలా..? వద్దా..? అనే అంశంపై అభిప్రాయాలు స్వీకరించనున్నారు బీజేపీ అగ్ర నేతలు. జనసేన వ్యవహరం పైనా సమావేశంలో ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉంది.. సమావేశానికి జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ హాజరుకాబోతున్నారు. మొత్తంగా ఏపీలో పొత్తుల వ్యవహారం తేల్చేసే దిశగా కసరత్తు చేస్తోంది బీజేపీ.


టీడీపీ, జనసేన కూటమిలో చేరుతుందా  ?                             


 ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-బీజేపీ పొత్తులో ఉన్నాయని పలు సందర్భాల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.. అంతేకాదు.. తాము కూడా జనసేనతోనే ఉన్నట్టు ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి సహా ఆ పార్టీ నేతలు కూడా చెబుతూ వస్తున్నారు.. ఇదే సమయంలో.. పొత్తులపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. మొత్తంగా.. బీజేపీతో పొత్తులో ఉండగానే.. టీడీపీతో జతకడుతూ తమ నిర్ణయాన్ని ప్రకటించారు పవన్‌ కల్యాణ్‌.. దీంతో.. టీడీపీ-జనసేన పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీచేయడంపై క్లారిటీ వచ్చినా.. వారితో బీజేపీ వస్తుందా? లేదా? అనేది మాత్రం ఇప్పటికీ తేలలేదు. దీంతో.. ఆ రెండు పార్టీల కూటమితో కలిసి వెళ్దామా? లేదా? అనే ఆలోచనలో పడిపోయింది బీజేపీ.. దీనిపై తేల్చేసేందుకు సిద్ధం అయ్యింది. మరి బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటంది అనేది ఆసక్తికరంగా మారింది.