Bill Gates Foundation:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో బిల్ గేట్స్ తో సమావేశం అయ్యారు.  సుమారు 40 నిమిషాలపాటు  చంద్రబాబు, బిల్‌గేట్స్‌  చర్చించారు.  ఆంధ్రప్రదేశ్ లో   బిల్ గేట్ ఫౌండేషన్ చేపట్టనున్న నూతన కార్యక్రమాల గురించి చర్చించారు.  బిల్ గేట్స్ తన సంపదలో చాలా మొత్తాన్ని  సేవలకు వినియోగిస్తున్నారు. గేట్స్ ఫౌండేషన్ ద్వారా  పలు దేశాల్లో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏపీలో కూడా ఆయన పలు రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ ద్వారా సేవలు అందించేందుకు ముందుకు వచ్చారు. ఇందు కోసం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నారు. 


ఏపీలో పలు అంశాల్లో గేట్స్ ఫౌండేషన్ సేవలు        


గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా ఆరోగ్యం, విద్య, డిజిటల్‌ పాలన, వ్యవసాయం, ఏఐ టెక్నాలజీతో ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యం వంటి రంగాల్లో ఏపీ ప్రభుత్వానికి సహకారం అందించే అంశంపై ఒప్పందాలు జరిగినట్లుగా తెలుస్తోంది.  ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌తో కలసి టెలీ మెడిసిన్‌  అందించేందుకు బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌ సహకరించేందుకు అంగీకరించింది. ప్రభుత్వ పాఠశాలల్లో కృత్రిమ మేధ సహకారంతో విద్యను అందించే సాంకేతికను  గేట్స్‌ ఫౌండేషన్‌ అందిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో విద్యను నేర్చుకునే విధానాలు, బోధనా అంశాలను  సమకూర్చి.. విద్యార్థులు మెరుగైన భవిష్యత్ కోసం తన వంతు సాయం చేస్తున్నారు.  


ఉద్యోగులకు ఏఐ వినియోగంలో శిక్షణ        


ప్రభుత్వ సంక్షేమ పథకాలు  అర్హులకు చేరడం వంటి విషయాల్లో టెక్నాలజీ కూడా అందించేందుకు గేట్స్ ఫౌండేషన్ అంగీకరించింది. వ్యవసాయంలో డిజిటల్‌ విధానాలు, కృత్రిమ మేధ సహకారాన్ని  గేట్స్ ఫౌండేషన్ అందించనుంది.  సాంకేతిక నైపుణ్యాలపై రైతులు అవగాహన పెంచుకుని వ్యవసాయంలో  ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తారు.  స్పేస్‌ అప్లికేషన్స్‌ శాటిలైట్‌ సిస్టమ్స్‌ను ప్రారంభిస్తామని బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌  ఇప్పటికే ప్రకటించింది.  ఏఐ టెక్నాలజీని వినియోగించేలా ప్రభుత్వ ఉద్యోగులకు బిల్‌ గేట్స్‌ ఫౌండేషన్‌ అవగాహన కల్పిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో యువతకు ఉపాధి కల్పన లక్ష్యంతో  శిక్షణ కూడా ఇస్తుందని  తెలుస్తోంది.                                   


బిల్ గేట్స్ తో చంద్రబాబుకు మంచి సంబంధాలు             


బిల్ గేట్స్ తో చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు మొదటి సారి సీఎం అయినప్పుడు బిల్ గేట్స్ తో సమావశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తన ఆలోచనుల వివరించడంతో హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ డెవలప్‌మెంట్ సెంటర్ ను పెట్టాలని నిర్ణయించుకున్నారు. మైక్రోసాఫ్ట్ వల్లనే హైదరాబాద్ కు ఇతర సాఫ్ట్ వేర్ కంపెనీలు పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. గేట్స్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ నుంచి బయటకు  గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలను చూసుకుంటున్నారు. వాటిని ఏపీ సీఎం చంద్రబాబు విస్తృతంగా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నారు. ఏపీలో యువతకు, రైతులు కాలంతో పాటు మారే టెక్నాలజీని అందిపుచ్చుకునే అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.