Former TTD Chairman Bhumana Karunkar Reddy :  తిరుపతి:  కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం తిరుమల ప్రసాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. తిరుమల లడ్డూ, ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం అన్నారు. కేవలం తన రాజకీయ లబ్ధికోసం, రాజకీయ స్వార్థకోసం భగవంతుడ్ని వాడుకుంటే.. అలాంటి ఆరోపణలు చేసినవాడ్ని భగవంతుడు క్షమించడని భూమన అన్నారు. గత కొన్ని రోజులుగా తిరుమల విషయంపై వైసీపీ, టీడీపీ నేతల మాటల యుద్ధం కొనసాగుతుండగా.. సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) తాజాగా చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది.


భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఇందులో ఎలాంటి సందేహం లేదు. శ్రీ వేంకటేశ్వరస్వామి దుష్టశిక్షణ చేస్తాడని స్వయంగా చంద్రబాబే పలుమార్లు చెప్పారని నేను ఆ విషయాన్ని గుర్తుచేస్తున్నాను. కనుక ఇలాంటి నీచమైన ఆరోపణలు చేసిన వ్యక్తిని భగవంతుడు చూస్తూ ఊరుకోడు. రాజకీయ ప్రత్యర్థులను దృష్టిలో ఉంచుకుని భగవంతుడి పేరుమీద ఆరోపణలు చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. గతంలో వైఎస్సార్ (YSR) సీఎంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేసిన సందర్భాలున్నాయి. దీనికి అప్పుడు భగవంతుడు శిక్ష కూడా విధించాడు. అయినా చంద్రబాబు మారలేదు. ఇప్పుడు మళ్లీ అలాంటి ఆరోపణలే చేస్తున్నాడు.


వాస్తవం ఏంటంటే, తిరుమలలో అన్నప్రసాదాలు తయారు చేసే విషయంలో అధికారులకు ఎలాంటి ప్రమేయం ఉండదు. పవిత్రమైన శ్రీ వైష్ణవుల అమృత హస్తాలమీదుగా ప్రసాదాలు, పదార్థాలు తయారవుతాయి. ప్రసాదాల్లో పదార్థాల వినియోగం వారి చేతుల మీదుగా జరుగుతుంది. అలాంటి వారి హస్తాలమీదుగా తయారయ్యే తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాడంటే.. ఆయన బురద రాజకీయాలకు పరాకాష్ట. ఈ దఫా అధికారంలోకి వచ్చింది మొదలు తిరుమల వేదికగా చంద్రబాబు చేసిన విషప్రచారాలు అన్నీ ఇన్నీకావు. చివరకు ఏమీ దొరక్కపోవడంతో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడని’ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు.
Also Read: 
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్ 


చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎల్లో మీడియా
తిరుమల ప్రసాదంపై తన కామెంట్లను హైలెట్‌ చేయాల్సిందిగా ఇప్పటికే అనుకూల మీడియాకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని వైసీపీ ఆరోపిస్తోంది. తిరుమల ప్రసాదం (Tirumala Laddu)పై చంద్రబాబు వ్యాఖ్యలను పట్టుకుని విషప్రచారం చేయాలన్నది వారి అజెండా అని వైసీపీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పటికే ఎల్లోమీడియా ప్రతినిధులు తిరుమలకు బయలుదేరారని, కొన్ని రోజులపాటు ఇదే అజెండా ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. 






చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా తిరుమల లడ్డూపై నీచాతినీచమైన వ్యాఖ్యలు చేశారని.. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమం నుంచి, విజయవాడ వరదల్లో సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి బయట పడేందుకు ఈ కామెంట్లు చేశారని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విమర్శలు, ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ (CBSE) సిలబస్ ఎత్తివేయడంపై వస్తున్న విమర్శలను ఎదుర్కోవడానికి, రాష్ట్ర ప్రజలను పక్కదోవ పట్టించడానికే చంద్రబాబు ఈ ఎత్తుగడకు దిగారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.