అనంతపురం జిల్లా గోరంట్లలో భీమ్లా నాయక్ సినిమా టికెట్ ధర 5 రూపాయలకు అమ్ముతుండడం కలకం రేపుతోంది. ప్రభుత్వం గతంలో నిర్ణయించిన మేరకు విక్రయిస్తున్నారు. దీంతో పవన్ అభిమానులు ఏకమై సినిమాకు, థియేటర్ యాజమాన్యానికి నష్టాలు రాకుండా తమ వంతు సాయం చేస్తున్నారు. అందు కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు కలిసి తమకు తోచినంత ఇస్తాం.. థియేటర్లను కాపాడుకుంటాం అంటూ ముందుకు వచ్చారు. గోరంట్లలోని చంద్రశేఖర్ థియేటర్ వద్ద జనసేన ఆధ్వర్యంలో కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు విరాళాల సేకరణ చేపట్టారు. తమకు తోచినంత ఇవ్వాలని కనిపించిన వారిని అడిగారు.


అంతేకాకుండా, అభిమానులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా కార్యదర్శి సురేష్, జనసేన నాయకుడు వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘‘అయ్యా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. మీరు ప్రజల కోసమే పని చేస్తామని ప్రజల సంక్షేమమే మా లక్ష్యం అని అంటున్నారు. మాది ప్రజా ప్రభుత్వమని అనేకసార్లు చెబుతున్నారు. కానీ నిరుపేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి సిమెంటు ధర రూ.500 కు చేరింది. సిమెంట్ కొనలేక నిరుపేద కుటుంబాల వాళ్ళు ఇల్లు నిర్మించుకోలేక ఆపేశారు. దానిపై దయలేని మీరు సినిమా టికెట్ల ధరలపై ఇలా ఎందుకు చేస్తున్నారో ఆలోచించుకోండి. 


‘‘అందులోనూ మీ భారతి సిమెంట్ రేటు కూడా పెంచారు. అందువలన మీరు ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి అయితే సినిమా టికెట్ల ధర తగ్గించిన విధంగా భారతి సిమెంట్ ధరలు తగ్గించి ప్రజలు సులభంగా ఇల్లు నిర్మించుకునేందుకు తక్కువ రేటుకే భారతి సిమెంట్ అందించి ఆదుకోండి’’ అని కోరారు.


కరోనా దాడి కన్నా, ఏపీ ప్రభుత్వ దాడి ప్రమాదకరం
పవన్ కళ్యాణ్ మీదనో భీమ్లా నాయక్ మీదనో కాదని, థియేటర్స్ మీద ఏపీ ప్రభుత్వం దాడి చేస్తుందని మాజీ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ఎన్.వి.ప్రసాద్ విమర్శించారు. నేడు తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మూడు వేవ్‌ల కరోనాల కన్నా ఏపీ ప్రభుత్వ దాడి ప్రమాదకరంగా ఉందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గుర్తింపు తెచ్చుకుంటుంటే ఏపీలో మాత్రం వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని నిబంధనలు ఏపీ థియేటర్ల మీద అమలు చేయడం వల్ల యాజమానులు నష్టపోతున్నారని ఆయన తెలియజేశారు. సీఎంకు, సినిమాటోగ్రఫీ మంత్రికి వాస్తవాలు తెలిసి చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. తెలియక ప్రపంచంలో లేని నిబంధనలు పెడుతున్నారని, పవన్ కళ్యాణ్, ఏపీ ప్రభుత్వం రాజకీయంగా మీరు మీరు తేల్చుకోవాలని, ఈ నిబంధనలతో థియేటర్ల యాజమాన్యాలు థియేటర్లు మూసి వేయాల్సిన పరిస్ధితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.