రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ లోకి చేరుకున్న సందర్భంగా వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన విమర్శలకు కాంగ్రెస్ కీలక నేత జై రామ్ రమేశ్ దీటుగా స్పందించారు. భారత్‌ జోడో యాత్ర ఏపీలోకి ప్రవేశిస్తున్న వేళ, ఆ పార్టీకి ఇక్కడ వచ్చేది, ఒరిగేది ఏమీ లేదని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టిన విషయాన్ని ప్రజలు రాహుల్‌ గాంధీకి గుర్తు చేయాలని చూస్తున్నారా అంటూ వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్‌లో ఓ ట్వీట్ చేశారు.


దీనిపై కాంగ్రెస్ నేత జై రామ్ రమేశ్ స్పందించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌ విభజనకు మద్దతిచ్చారని గుర్తు చేశారు. దీనిపై అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ కూడా రాశారని చెప్పారు. తాను ప్రస్తుతం బళ్లారిలో ఉన్నానని, ఆ లేఖ ప్రస్తుతం తన దగ్గర అందుబాటులో లేదని, తన ఇంట్లోని పుస్తకంలో ఉందని అన్నారు.


ఇది చూసిన కొందరు నెటిజన్లు అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేకు 2012 డిసెంబరు 28న అప్పటి వైఎస్ఆర్ సీపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ నేత ఎంవీ మైసురా రెడ్డి, సెంట్రల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు కేకే మహేందర్‌ రెడ్డి రాసిన లెటర్ ను పోస్టు చేశారు. ‘‘2011 జులై 8, 9వ తేదీల్లో వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ జరగ్గా, అందులో  తీసుకున్న నిర్ణయం ప్రకారం.. తెలంగాణ ప్రజల మనోభావాలను మా పార్టీ గౌరవిస్తుంది. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడం, లేదా విభజించడంపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉంది. అయినా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. అందరికీ ఆమోద యోగ్యమైన పరిష్కారం మేం కోరుతున్నాం’’ అని ఆ లేఖలో ఉంది. ఆ లేఖను జైరామ్ రమేశ్‌ మళ్లీ రీ ట్వీట్ చేశారు. 


సెప్టెంబర్‌ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్‌ ప్రారంభించిన భారత్‌ జోడో యాత్ర 38వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకూ ఆయన 1000 కిలో మీటర్లకు పైగా నడిచారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చే లక్ష్యంతోనే ఈ యాత్ర చేపట్టారు. 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 3,570 కిలో మీటర్లు సాగుతూ జమ్ము కశ్మీర్‌లో పాదయాత్ర ముగుస్తుంది.


ప్రస్తుతం కర్నాటకలోని బళ్లారిలో శనివారం జరిగిన మెగా ర్యాలీలో బీజేపీ, ఆరెస్సెస్‌లపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశాన్ని ముక్కలు చేయడమే బీజేపీ, ఆరెస్సెస్‌ల సిద్ధాంతమని ఆయన మండిపడ్డారు. దేశాన్ని చీల్చేందుకు బీజేపీ, ఆరెస్సెస్‌లు పూనుకుంటున్నాయని ప్రజలు భావిస్తుండటంతోనే దేశాన్ని కలిపిఉంచేందుకు ప్రజలను ఐక్యం చేసేందుకు తన పాదయాత్రకు భారత్‌ జోడో యాత్రగా నామకరణం చేశామని చెప్పారు.


‘‘మీ పార్టీ కీలక నేత పేరుపైనే ఈ లేఖ రాశారు. అలాంటప్పుడు తప్పకుండా మీ అధ్యక్షుడు జగన్‌ దానికి అమోదం తెలిపాకే ఈ లేఖ రాసి ఉంటారు.. ఇది మీకు గుర్తుందా? ఇంకా ఏమైనా చెప్పాలా?’’ అని విజయసాయి రెడ్డికి సమాధానం ఇచ్చారు.