Bapatla News : ప్రకృతి విపత్తులు, ఇతర అత్యవసర సమయాలలో జాతీయ రహదారులపై  విమానాలు దిగేందుకు వీలుగా చెన్నై-కోల్ కత్తా జాతీయ రహదారిపై ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రెండు ప్రాంతాల్లో రన్ వే లను అభివృద్ధి చేశారు. ఇందులో భాగంగా ప్రస్తుతం బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పిచ్చికలగుడిపాడు వద్ద జాతీయ రహదారిపై నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్  ట్రైల్ రన్ ను గురువారం నిర్వహిస్తున్నారు. సుమారు 4 విమానాలు వంద మీటర్ల కన్నా తక్కువ ఎత్తులో ఈ రన్ వే పై ప్రయాణిస్తున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలతో పాటు భద్రతను కట్టుదిట్టం చేశారు.


ఎయిర్ పోర్స్ ఆధ్వర్యంలో 


బాపట్ల జిల్లా కొరిశపాడు సమీపంలో జాతీయ రహదారిపై విమానాల ట్రయల్‌ రన్‌ విజయవంతంగా నిర్వహించారు. విమానాల అత్యవసర ల్యాండింగ్‌ కోసం చెన్నై-కోల్‌కతా హైవేపై కొరిశపాడు-రేణంగివరం మధ్య విమానాల రన్‌వే ఏర్పాటు చేశారు. దీని కోసం సుమారు 4 కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్డు నిర్మించినట్లు అధికారులు తెలిపారు. ట్రయల్‌ రన్‌లో భాగంగా ఒక కార్గో విమానం, నాలుగు ఫైటర్ జెట్లు కొరిశపాడు వచ్చాయి. ట్రయల్ రన్ లో భాగం ప్రదర్శించిన ఫైటర్‌ జెట్ల విన్యాసాలు అలరించాయి. రన్‌వేకు అత్యంత సమీపంలో వచ్చిన విమానాలు తిరిగి గాల్లోకి ఎగిరి వెళ్లిపోయాయి. ఈ ట్రయల్ రన్ కు సంబంధించిన ఏర్పాట్లను ఎయిర్ పోర్స్ అధికారులు పర్యవేక్షించారు. ఈ ట్రయల్‌ రన్‌ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ్‌కృష్ణ, ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ,పలువురు అధికారులు పాల్గొన్నారు.






ఏపీలో రెండు మార్గాల్లో 


తొలిసారిగా 2017 అక్టోబర్‌లో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ఫైటర్‌ జెట్ విమానాలు, రవాణా విమానాలను ప్రయోగాత్మకంగా లక్నో - ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ మార్గంపై అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా వివిధ చోట్ల ఈ తరహా సదుపాయాలను మెరుగు పరుస్తున్నారు. భూకంపాలు, వరదలు లాంటివి లేదా ఇంకేవైనా ప్రకృతి విపత్తులు సంభవించిన సందర్భంలో అత్యవసర పరిస్థితుల్లో ఈ ఎయిర్ స్ట్రిప్‌లను వాడుకోనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఎయిర్ స్ట్రిప్‌లను వినియోగించుకొనేందుకు వీటిని నిర్మిస్తున్నారు. యుద్ధ విమానాలను అత్యవసర పరిస్థితుల్లో క్షేమంగా నేలపైకి దించడానికి కొన్ని జాతీయ రహదాలను ఎంపిక చేసి వాటిలో కొంత దూరం మేర మార్పులు చేస్తున్నట్లు గతంలో ఓ సారి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో 19 చోట్ల అత్యవసర ల్యాండింగ్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు - ఒంగోలు, ఒంగోలు - చిలకలూరి పేట మార్గాలను అభివృద్ధి చేస్తామని గతంలోనే వెల్లడించారు. రోడ్లపై అత్యవసర ల్యాండింగ్‌ సౌకర్యం అనేది యుద్ధ సమయాల్లోనే కాకుండా వరదలు లేదా ఇతర విపత్తుల సమయంలోనూ బాగా ఉపయోగపడుతుందని ఆ సందర్భంగా మరో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.