Hindupur News: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేపట్టిన ఎన్నికల ప్రచారం రెండవ రోజు శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఫుల్ జోష్ నింపే విధంగా ప్రచారం కొనసాగింది. కొండూరు, కల్లూరు, నాయన పల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బాలయ్య డప్పు కొట్టిన విధానం అక్కడ ఉన్న ప్రజలకి ఎంతో సంతోషాన్ని కలిగించింది. జై బాలయ్య.. జై బాలయ్య.. అంటూ పెద్ద ఎత్తున కేరింతల కొట్టారు అభిమానులు, ప్రజలు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. అంబేద్కర్ విదేశీ విద్యను జగన్ విదేశీ విద్యగా పేరు మార్చారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో యువతను గంజాయికి, డ్రగ్స్ కి అలవాటు చేసి భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం గడిచిన ఐదేళ్లలో వైసీపీ పాలనలో ఉన్న పరిశ్రమలన్నీ ఖాళీ చేసి రాష్ట్రాలకు వెళ్లిపోయాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దళితులకు రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇస్తామని అన్నారు. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా బికే పార్థసారథిని గెలిపించాలని బాలయ్య ఓటర్లను అభ్యర్థించారు. మీ ఓటు అనే వజ్రాయుధంతో సుపరిపాలన అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచించారు.