Kurnool Avinash Reddy :  ఎంపీ అవినాష్ రెడ్డి తల్లికి కర్నూులో చికిత్స అందిస్తున్నారు. అక్కడి ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. ఉదయం సీబీఐ కార్యాలయానికి వెళ్తున్న సమయంలో  తల్లికి అనారోగ్యం అనే సమాచారం రావడంతో సీబీఐ ఆఫీసుకు వెళ్లకుండా నేరుగా పులివెందుల వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దారిలో ఉండగానే  అవినాష్ రెడ్డి తల్లిని పులివెందులలోని గంగిరెడ్డి ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో తరలించారు. తల్లిని తాడిపత్రి వద్ద అంబులెన్స్‌లో పరామర్శించిన తర్వాత ఆమెను హైదరాబాద్ లేదా బెంగళూరు తరలించాలని అనుకున్నారు. అంబులెన్స్ తో పాటు అందరూ బయలుదేరారు. అయితే దారిలో కర్నూలులోనే ఆమెకు చికిత్స అందించేందుకు చేర్పించారు. 


అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితిపై బయటకు రాని సమాచారం                                    


అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది.. అక్కడే చికిత్స అందిస్తారా లేదా హైదరాబాద్ , బెంగళూరు తరిస్తారా అన్న సమాచారం బయటకు రాలేదు. అయితే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. సీబీఐ అధికారులు కర్నూలు వరకూ వచ్చారు. తర్వాత వెనుదిరిగి వెళ్లిపోయారు. విచారణకు సహకరించకపోతూండటంతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ అధికారులు శనివారం కీలక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఈ లోపు తన తల్లిని చూసుకోవడానికి తనకు ముందస్తు బెయిల్ కావాలని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. 


అవినాష్ రెడ్డి విచారణకు సహకరిస్తున్నారన్న సజ్జల                             


మరో వైపు అవినాష్ రెడ్డి పారిపోలేదని.. సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.  అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని..  కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో వార్తలు ఇస్తున్నాయని మండిపడ్డారు.  తల్లి అనారోగ్యం గురించి సీబీఐకి సమాచారం ఇచ్చే ఉంటారని..  సీబీఐ విచారణకు అవినాష్ హాజరుకాకపోవడంపైతప్పుడు ప్రచారం చేస్తున్నారని అమరావతిలో విమర్శించారు.  
ఏదో జరిగిపోతుందని కొందరు హడావుడి చేస్తున్నారని..  తల్లికి సీరియస్‌గా ఉందనే సీబీఐ విచారణకు అవినాష్ హాజరు కాలేదన్నారు.  మీడియా వెంట పడటం ఏంటో నాకు అర్థం కావడం లేదన్నారు.  వివేకా హత్యలో అవినాష్ పాత్ర ఉంటేఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబు వదిలేవాడా.. అని ప్రశ్నించారు. 


మీడియాపై సజ్జల ఆగ్రహం                         


5 సార్లు సీబీఐ ముందు హాజరైన అవినాష్ ఇప్పుడెందుకు తప్పించుకోవాలని అనుకుంటాడని సజ్జల ప్రశఅనించారు.  సీబీఐ ఎదుటకు రేపయినా వెళ్లాల్సిందేనన్నారు. అసలు హత్య చేశానన్నవాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు.. ఒక ఎంపీని మాత్రం వెంటాడుతున్నారన్నారు.  ఒక వేళ ఎక్స్‌ ట్రీమ్‌గా వ్యవహరించినా ఫేస్ చేయడానికి సిద్దంగా ఉన్నాడని సజ్జల స్పష్టం చేశారు.