Andhra Pradesh: విక్టోరియా రాష్ట్రానికి చెందిన ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ పార్లమెంటు సభ్యుల బృందం సోమవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని మర్యాద పూర్వకంగా సందర్శించారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని ఆస్ట్రేలియా నేతలు కలిశారు. విద్యుత్, విద్య, నైపుణ్య అభివృద్ధి రంగాలకు సంబంధించిన సినర్జీలపై వరుస చర్చలు జరిగాయి. సమావేశం అనంతరం జరిగిన చర్చలపై ప్రతినిధి బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.


ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై ప్రశంసలు గుప్పించింది. అయితే ఇందులో లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రభుత్వ విప్, లెజిస్లేటివ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కూడా ఉన్నారు. పవన, సౌర శక్తి రంగాల కింద ఏపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఆసక్తికరంగా ఉన్నాయని, అక్కడి ప్రభుత్వ విప్, ఎంపీ అయిన లీ టర్మలీస్ పేర్కొన్నారు. ఏపీలో పవన, సౌర శక్తి పరంగా ప్రభుత్వం చేపట్టిన ఆసక్తికరమైన కార్యక్రమాలు, అభివృద్ధి గురించి తాను వింటున్నట్లు వివరించారు.






ఇక్కడి విద్యా విధానాలకు తమకు చాలా సారూప్యతలు ఉన్నాయని వివరించారు. ఇద్దరి దృష్టి ఒకేలా ఉంది కాబట్టి పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటామన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం స్పష్టంగా ఉందని శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎంపీ మాథ్యూ ఫ్రెగాన్ తెలిపారు. సీఎం తన సమయంలో చాలా ఉదారంగా వ్యవహరించారని.. అందువల్లే తమ సంభాషణ ముందుకు సాగిందన్నారు. పాఠశాల కార్యక్రమాల కింద ప్రాథమిక మార్పులకు సంబంధించి తాము తీసుకువస్తున్న విదానాలు, లక్ష్యాలు ఒకే విధంగా ఉన్నాయని వివరించారు.