Mekapati Vikram Reddy : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సీఎం జగన్ భేటీ అయ్యారు. ఉపఎన్నికలో విజయం సాధించడంపై సీఎం జగన్ అభినందించారు. విక్రమ్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించారు. ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి వెంట మంత్రులు కాకాణి గోవర్దన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపఎన్నికల ఫలితాలతో సహా ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి పలు అంశాలపై సీఎం జగన్ తో చర్చించానన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి పలు ప్రతిపాదనలను సీఎం ముందు ఉంచానన్నారు. అభివృద్ధి ప్రతిపాదనలపై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంలో అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి కృషి చేశారన్నారు. గౌతమ్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పథకాలను కొనసాగిస్తానన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగిస్తానని ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి అన్నారు. మేకపాటి కుటుంబానికి మంత్రివర్గంలో స్థానం కల్పించే అంశం సీఎంతో సమావేశంలో చర్చకు రాలేదన్నారు. తాను ఇప్పుడే ఎమ్మెల్యే అయ్యానని, నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను మంత్రి పదవికి అనర్హుడు అన్నారు.
ఆత్మకూరు ఉపఎన్నిక
ఆత్మకూరు ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై 82,888 ఓట్ల ఆధిక్యంతో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి గెలిచారు. పోస్టల్ బ్యాలెట్ సహా 20 రౌండ్లు పూర్తయ్యేసరికి 82,888 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలిచారు. సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. మేకపాటి విక్రమ్ రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌కు 19,352 ఓట్లు వచ్చాయి.
విక్రమ్ రెడ్డి ఘన విజయం
మొదటి రౌండ్ నుంచి కూడా మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలోనే కొనసాగారు. ప్రధాన ప్రతిపక్షం ఏదీ బరిలో లేకపోవడంతో ఆయన గెలుపు సునాయసం అయింది. ప్రతి రౌండ్ కి మేకపాటి భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. పోటీలో నిలిచిన మరే ఇతర పార్టీ అభ్యర్థి కూడా విక్రమ్ రెడ్డికి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. పోస్టల్ బాలెట్‌లో 205 ఓట్లకు గానూ వైఎస్సార్ సీపీకి 167 ఓట్లు వచ్చాయి. దీంతో, బ్యాలెట్ ఓట్లలోనూ వైఎస్సార్ సీపీ భారీ ఆధిక్యం కనబర్చింది.
Also Read : CM Jagan: సెప్టెంబరులోపు పిల్లలకి ఫ్రీగా ట్యాబ్‌లు, అమ్మఒడి అందుకే కొందరికి రాలేదు: సీఎం జగన్