Arogya Sri Services Close: రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలను నిలిపేసేందుకు ప్రైవేటు ఆస్పత్రులు సిద్ధమయ్యాయి. ఈ నెల 25 నుంచి ఆరోగ్య నెట్వర్క్‌ పరిధిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో సేవలు అందించబోమని అసోసియేషన్‌ ప్రతినిధులు వెల్లడించారు. ప్రతి జిల్లాలోనూ నెట్వర్క్‌ ఆస్పత్రులకు రూ.50 నుంచి రూ.100 కోట్ల మేర ప్రభుత్వం బకాయి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వేయి కోట్లకుపైగా బిల్లులను పెండింగ్‌లో పెట్టింది.


గత నెలలో సేవలు బంద్‌ చేస్తామని ఆస్పత్రి యాజమాన్యాలు హెచ్చరించడంతో కొంత వరకు పెండింగ్‌ బకాయిలు ప్రభుత్వం చెల్లించింది. మిగిలిన మొత్తాన్ని డిసెంబరు 31లోగా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ రోజులు గడుస్తున్నా నెరవేరకపోవడంతో ఆస్పత్రుల యాజమాన్యాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు సుమారు 500 వరకు ప్రైవేటు ఆస్పత్రులు నెట్వర్క్‌ పరిధిలో ఉన్నాయి. వీటిన్నింటిలోనూ గురువారం ఉదయం నుంచి కొత్తగా వచ్చే రోగులకు వైద్య సేవలను అందించారు. రోగుల రిజిస్ర్టేషన్లు కూడా ప్రారంభించమని ఆస్పత్రులు ప్రతినిధులు చెబుతున్నారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్‌ బకాయిలను క్లియర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. బకాయిలు క్లియర్‌ చేస్తేనే సేవలను పునరుద్ధరిస్తామని స్పష్టం చేస్తున్నారు. 


రోగులకు తీవ్ర ఇబ్బందులు


నెట్వర్క్‌ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిపేయడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. ప్రతిరోజూ ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా నెట్వర్క్‌ ఆస్పత్రుల్లో కనీసం ఐదారు వేల మంది కొత్త రోగులు వైద్య సేవల కోసం చేరుతుంటారు. వీరంతా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అత్యవసర వైద్య సేవల సంగతి ఏమిటన్నదానిపైనా ఆస్పత్రుల యాజమాన్యాలు స్పష్టత ఇవ్వలేదు. అత్యవసర శస్త్ర చికిత్సలను ఆరోగ్య శ్రీ పథకంలో చేయకుండా నిలిపేస్తే రోగులు మరింత ఇబ్బందిపడే అవకాశముంది. దీనిపై ప్రభుత్వం తక్షణమే తగిన నిర్ణయం తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మరి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.