Andhra Pradesh Elections 2024: ఏపీ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్దమవుతోంది. అభ్యర్థుల ఖరారుపై కూడా ఏఐసీసీ దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు విజయవాడ (Vijayawada)లోని ఏపీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. బుధవారం పలువురు ఆశావాహులు రానున్న ఎన్నికల్లో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మాణికం ఠాగూర్‌కు దరఖాస్తులు అందించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి మస్తాన్ వలీ, బద్వేల్ నియోజకవర్గం నుంచి కమలమ్మ, మడకశిర నియోజకవర్గం నుంచి సుధాకర్ దరఖాస్తు చేసుకున్నారు.


తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ దరఖాస్తులు 
అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కోసం కూడా కాంగ్రెస్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. నేతలతో పాటు కార్యకర్తలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పార్టీ వర్గాలు వెల్లడించాయి.  స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తులను స్క్యూటినీ చేసి అభ్యర్థుల ఎంపిక చేయనుంది. అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత జాబితాను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపనుంది. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ జాబితాకు ఆమోదం తెలిపిన తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. త్వరలోనే ఏపీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ పర్యటించనున్నట్లు మాణికం ఠాగూర్ స్పష్టం చేశారు. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ రెడీగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. 


షర్మిల పైనే ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ 
ఏపీలో వైఎస్ షర్మిల ఎంట్రీ తర్వాత కాంగ్రెస్ బలం పుంజుకునే ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ నుంచి బయటకొచ్చిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ కాంగ్రెస్‌ను బలోపేతం చేసే చర్యలు చేపట్టారు. రోజుకో జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇతర పార్టీల్లో అసంతృప్తి నేతలను కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా షర్మిల ఆహ్వానిస్తున్నారు. అలాగే జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీంతో గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో షర్మిల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు. జగన్‌పై షర్మిల చేసే విమర్శలు మీడియాలో హైలెట్ అవుతున్నాయి.


అయితే వచ్చే ఎన్నికల్లో షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. లోక్‌సభకు పోటీ చేస్తారా? లేదా అసెంబ్లీకి పోటీ చేస్తారా? అనేది స్పష్టత లేదు. కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తారనే వార్తలొచ్చాయి. కానీ దీనిపై షర్మిల ఇప్పటివరకు స్పందించలేదు. లోక్‌సభకు షర్మిల పోటీ చేసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. కడప అంటేనే వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. ఎన్నో ఏళ్లుగా కడప రాజకీయాల్లో వైఎస్ ఫ్యామిలీ హవానే నడుస్తోంది. దీంతో  పోటీ చేయడానికి కడప జిల్లానే షర్మిల ఎంచుకునే అవకాశముందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇతర పార్టీలలో సీటు దక్కని చాలామంది నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు. వారికి కూడా కాంగ్రెస్ టికెట్లు కేటాయించనుంది. ఏపీలో కాంగ్రెస్ చతికిలపడటంతో చాలామంది నేతలు వైసీపీకి వెళ్లారు. ఇప్పుడు షర్మిల ఏపీపీసీసీ బాధ్యతలు చేపట్టడంతో వైసీపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు జరగనున్నాయి.