APSRTC - SSC Exams : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే విద్యార్థుల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి జ‌రిగే ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే విద్యార్థుల‌కు ఏపీఎస్ ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణ స‌దుపాయం క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అన్ని ప‌ల్లెవెలుగు, సిటీ ఆర్డిన‌రీ బ‌స్సుల్లో ఈ స‌దుపాయం అందుబాటులో ఉంటుంద‌ని ఏపీఎస్ ఆర్టీసీ ప్ర‌క‌టించింది.

పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు.. ఇంటి నుంచి పరీక్ష కేంద్రం వరకు ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా రాకపోకలు సాగించేందుకు వీలుకల్పిస్తూ ఆర్టీసీ యాజమాన్యం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. బస్సు పాస్ లేక‌పోయినా.. ప‌రీక్ష‌కు సంబంధించిన‌ హాల్‌ టికెట్‌ చూపించి విద్యార్థులు ఉచితంగా పరీక్షా కేంద్రానికి చేరుకోవచ్చు. పరీక్ష పూర్తి అయిన అనంతరం తిరిగి తమ గమ్యస్థానాలకు ప్రయాణించవచ్చు అని పేర్కొంది.

ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,348 కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షలకు 6.64 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఆ స‌మ‌యంలో ఉచిత బ‌స్సు స‌దుపాయం అందుబాటులో ఉంటుంద‌ని ఆర్టీసీ వెల్ల‌డించింది. విద్యార్థుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా జిల్లా విద్యాశాఖ అధికారులతో సంప్రదించి అవసరమైన మేరకు బస్సులు నడపాలని జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారులను ఈడీ (ఆపరేషన్స్‌) బ్రహ్మానందరెడ్డి ఆదేశించారు. ఈ అవకాశాన్ని రాష్ట్రంలోని 10వ తరగతి విద్యార్థులు అంద‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.

ప‌రీక్ష‌ల స‌మ‌యంలో హ‌డావుడి ప‌డ‌కుండా స‌మ‌యానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని విద్యార్థుల‌ను ఏపీఎస్ ఆర్టీసీ కోరింది. విద్యార్థుల భ‌విష్య‌త్ కోణంలోనే ఏపీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుందని, దీని పట్ల 10వ తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కాగా.. ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో రాష్ట్రంలోని 10వ తరగతి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు రాష్ట్రంలో 6,10,000 మంది రెగ్యులర్, 55వేల మంది ప్రైవేటు విద్యార్థులు హాజరవుతారన్నారు. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ప‌ద‌వ త‌ర‌గ‌తి పరీక్షలు నిర్వహించనున్నారు. 6 పేపర్లతో పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త విధానం ప్రకారం పది పరీక్షల మాదిరి ప్రశ్నపత్రాలు, బ్లూప్రింట్‌, ప్రశ్నల వారీగా వెయిటేజీ వివరాలను బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంచింది. మరోవైపు 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకెడమిక్ క్యాలెండర్ ప్రకారం.. 1 నుంచి 9 తరగతులకు సమ్మెటివ్ 2 పరీక్షలు ఏప్రిల్ 27తో ముగియనున్నాయి.

పరీక్షల షెడ్యూలు ఇలా..

పరీక్ష తేదీ పేపరు
ఏప్రిల్ 3 ఫస్ట్ లాంగ్వేజ్
ఏప్రిల్ 6 సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 8 ఇంగ్లిష్
ఏప్రిల్ 10 మ్యాథమెటిక్స్
ఏప్రిల్ 13 సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ)
ఏప్రిల్ 15 సోషల్ స్టడీస్
ఏప్రిల్ 17 కాంపోజిట్ కోర్సు
ఏప్రిల్ 18 ఒకేషనల్ కోర్సు

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ 11 పేపర్లుగా నిర్వహిస్తున్న పదోతరగతి పరీక్షలను ఆరు పేపర్లకు కుదించింది. రెండేళ్ల కిందటి వరకు 11 పేపర్ల విధానమే అమలైంది. కొవిడ్‌ అనంతరం 2021-22 విద్యాసంవత్సరానికి పరీక్షలను ఏడు పేపర్లతో నిర్వహించారు.