APSRTC: ఏపీలో దసరా పండుగ నాటికి స్టార్ లైనర్ పేరిట నాన్ ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. మొత్తంగా 62 స్టార్ లైనర్ బస్సులను ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సరికొత్త విధానంలో ప్రయోగాత్మకంగా ఈసారి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వివరించారు. మంచి ఫలితాలు వస్తే ఇదే విధానాన్ని కొనసాగిస్తామని.. లేదంటే పాత పద్దతి అమలుపై ఆలోచిస్తామన్నారు. ప్రయాణికుల ఫిర్యాదులు, సలహాల కోసం 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేయసామన్నారు. ఏమైనా ఫిర్యాదులు, సలహాలు ఉంటే 0866-2570005 నంబర్ కు ఫోన్ చేయొచ్చని ఎండీ సూచించారు. దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలకు 4,100 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎశ్ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించింది. వాటల్లో అదనంగా 50 శాతం ఛార్జీలు సైతం వసూలు చేయడం లేదని పేర్కొంది. 


రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సాధారణ బస్సులకు అదనంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు అదనంగా ప్రత్యేక బస్సులు నడపనుంది. రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు కల్గకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులకు పెంచి పీఆర్సీకీ అనుగుణంగా వేతనాలు చెల్లిస్తామని ద్వారకా తిరుమలరావు తెలిపారు. పదోన్నతులు పొందిన రెండు వేల మంది ఉద్యోగులకు అక్టోబర్ లో పాత వేతనాలే ఇవ్వనున్నట్లు చెప్పారు. పదోన్నతుల ఆమోదం అనంతరమే ఉద్యోగులకు పెంచిన వేతనాలు చెల్లించనున్నట్లు స్పష్టం చేశారు.   


ఆ మూడు రోజులే ఎక్కువ.. 


పండుగకు సొంత ఊరు వెళ్లి బందుమిత్రులతో కలిసి సరదాగా గడపాలని అంతా అనుకుంటారు. అక్టోబరు 3న దుర్గాష్టమి, 4న నవమి, 5న విజయ దశమి కావడంతో.. ఈ నెల 30, అక్టోబరు 1, 2 తేదీల్లో ఎక్కువ మంది పల్లెలకు వెళ్తుంటారు. ఈ నెల 29వ తేదీ నుండి 5వ తేదీ వరకు రైళ్లలోని బెర్తులన్నీ నిండి పోయాయి. హైదరాబాద్ నుండి అటు ఆంధ్ర ప్రదేశ్ లోని నగరాలు సహా గ్రామాలకు, ఇటు తెలంగాణ లోని జిల్లా కేంద్రాలు సహా.. పల్లెటూర్లకు వెళ్లేందుకు చాలా మంది పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను ఉపయోగిస్తారు. అయితే.. రైళ్లలో ఖాళీ లేకపోవడం వారిని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. దీంతో చాలా మంది బస్సుల్లో వెళ్దామనుకుంటున్నారు. కానీ అందులోనూ నిరాశ తప్పడం లేదు. బస్సు ఛార్జీలు విపరీతంగా పెంచడంతో బస్సు ఛార్జీలు చూస్తేనే షాక్ కొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో ఇటీవల ఛార్జీలను విపరీతంగా పెంచాయి. ఛార్జీలు, సర్ ఛార్జీలు, సెస్సుల పేరుతో ధరల బాదుడు గట్టిగానే ఉంది. పండగ పూట స్పెషల్ బస్సుల పేరుతో మరింత ఛార్జీలు పెంచే అవకాశం ఉండటంతో.. ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ దసరా పర్వ దినానికి సొంతూరికి ఎలా వెళ్లడం అని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. 


Also Read : BJP Prajaporu : చాపకింద నీరులా ఏపీబీజేపీ ప్రచారం - ప్రజాపోరు సభలతో బలపడేందుకు గట్టి ప్రయత్నాలు !