AP Group 2 Exam Postponed | అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం జరగనున్న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై క్లారిటీ వచ్చేసింది. ఫిబ్రవరి 23న ఏపీ గ్రూప్ 2 పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) స్పష్టం చేసింది. కొందరు అభ్యర్థులు వాయిదా కావాలని కోరుతున్నారని, ప్రభుత్వం దీనిపై పునరాలోచించి నిర్ణయం తీసుకుంటుందని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలపై గందరగోళం నెలకొంది. అయితే పరీక్షల నిర్వహణపై ఏపీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. ఎగ్జామ్ వాయిదా అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కమిషన్ కొట్టిపారేసింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ 23న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష
మొత్తం 92,250 మంది అభ్యర్థులు ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాయనున్నారు. ఆదివారం నాడు (ఫిబ్రవరి 23న) గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహణకు ఏపీపీఎస్సీ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం, మధ్యాహ్నం రెండు పూటల ఎగ్జామ్స్ జరగనున్నాయి. పేపర్-1 ఎగ్జామ్ ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, పేపర్ 2 ఎగ్జామ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. అభ్యర్థులు అరగంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలని, చివరి నిమిషంలో చేసే తప్పిదాలతో పరీక్ష మిస్ చేసుకునే పరిస్థితి ఉంటుందని హెచ్చరించింది.
ట్విస్ట్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..
గ్రూప్స్ 2 మెయిన్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని ఏపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఫిబ్రవరి 23న నిర్వహించాల్సిన పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీకి కూటమి ప్రభుత్వం లేఖ రాసింది. ప్రస్తుతం ఉన్న రోస్టర్ తప్పుల సరిచేయకుండా గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై అభ్యర్ధుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఇది ప్రస్తుతం కోర్టులో రోస్టర్ అంశంపై పిటిషన్ మార్చి 11 న విచారణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోర్టులో ఉన్న ఈ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉంది. అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ తేదీలో మార్పులేదని కమిషన్ ప్రకటన విడుదల చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.