APPCC Chief YS Sharmila: కడప: కాంగ్రెస్ పార్టీ తరఫున కడప పార్లమెంట్‌కి పోటీ చేస్తున్నానని, ఈ నిర్ణయం అంత సులువైంది కాదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తాను ఈ పోటీలో ఉంటే మా కుటుంబం నిట్ట నిలువునా చీలిపోతుందని తెలిసే నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. దివంగత నేత వైఎస్సార్ (YSR) అభిమానులకు ఇది చాలా క్లిష్ట పరిస్థితి. తన నిర్ణయంతో ఎటు వెళ్లాలి అనేది వైఎస్సార్ అభిమానులు నిర్ణయించుకోవాలన్నారు. గత ఎన్నికల ముందు, ఏపీ ముఖ్యమంత్రి అయ్యే వరకు జగన్ (YS Jagan).. నాకు నువ్వు చెల్లి కాదు బిడ్డ అని అన్నారని షర్మిల గుర్తుచేసుకున్నారు. సీఎం అయ్యాక జగన్ పూర్తిగా మారిపోయారు, నా అనుకున్న వారిని నాశనం చేశారని సోదరుడు జగన్ పై కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. సీఎం జగన్, వైసీపీ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు.
జగన్ నిర్ణయాన్ని తట్టుకోలేకపోతున్న షర్మిల
తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని హత్య వెనకున్న వారికి ఏపీ సీఎం వైఎస్ జగన్ వైసీపీ టికెట్ ఇవ్వడం తట్టుకోలేక పోతున్నానన్నారు. హత్య చేయించిన వారికి టికెట్ ఇస్తే ప్రజలు హర్షించరని తెలిసినా వైఎస్ అవినాష్ రెడ్డికే టికెట్ ఇచ్చారు. చిన్నాన్న వివేకా చివరి కోరిక నేను కడప ఎంపీగా పోటీ చేయాలన్నారు. బాబాయ్ కోరిక నెరవేర్చడానికే కడప ఎంపీగా బరిలో దిగుతున్నా. తనను ఆశీర్వదించాలని కడప ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివేకా హత్య జరిగితే గుండెపోటు అని జగన్ సొంత మీడియాలో దుష్ప్రచారం చేశారని, గత ఐదేళ్లు అవినాష్ రెడ్డిని ఎందుకు వెనకేసుకొచ్చారని ఈ సందర్భంగా షర్మిల ప్రశ్నించారు.
‘కడప ఎంపీగా నువ్వు నిలబడాలమ్మా అని బాబాయ్ వివేకా రెండు గంటలపాటు అడిగారు. అప్పుడు ఆయన ఎందుకు అలా అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. రామలక్ష్మణుల్లా వైఎస్సార్, వివేకా ఉండేవారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నంతకాలం వివేకా ఆయన బాటలోనే నడిచారు. కానీ బాబాయ్ హత్యకు గురయ్యారు. కేసులో నిందితుడిగా ఉన్న అవినాశ్ రెడ్డికి జగనన్న మద్దతిస్తూనే వచ్చారు. పైగా, చిన్నాన్న బిడ్డ సునీతకు అండగా నిలవాల్సింది పోయి, ఆమెను దోషి అని ప్రచారం చేయడం సిగ్గుచేటు. వివేకాను చంపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ కు జగనన్న కడప ఎంపీగా టికెట్ ఇచ్చారు. అన్యాయం, దుర్మార్గాలకు వైసీపీ అండగా నిలవడంతో.. కడప ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. హత్యా రాజకీయాలకు నేను విరుద్ధం కనుక హంతకులు చట్టసభల్లోకి వెళ్లకూడదని వైఎస్సార్ బిడ్డగా కడప ఎంపీగా పోటీ చేస్తున్న. కానీ వైఎస్సార్ బిడ్డ అయి ఉండి జగనన్న నాన్నగారి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు అకాశం ఇచ్చారు. ప్రత్యేక హోదా రాలేదు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. కనుక ప్రజలు జగనన్నకు మరో అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి’ - వైఎస్ షర్మిల
ఏఐసీసీ ఏపీ కాంగ్రెస్ నుంచి 114 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 5 లోక్ సభ స్థానాలకు మంగళవారం నాడు అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఆర్థర్ కు నందికొట్కూరు, ఎలీజాకు చింతలపూడి నుంచి సీటు కేటాయించారు.