TS DSC Exams: తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ (TS DSC 2024) పరీక్షల తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. జులై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఇక ఇప్పటికే డీఎస్సీ దరఖాస్తు గడువును జూన్ 20 వరకు పొడిగిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1000 చెల్లించి జూన్ 20 రాత్రి 11.50 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు.
తెలంగాణ ప్రభుత్వం తాజాగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4న ప్రారంభంకాగా.. ఏప్రిల్ 2 వరకు ఫీజు చెల్లింపు, ఏప్రిల్ 3తో ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ముగియనుందని విద్యాశాఖ నోటిఫికేషన్ సమయంలో పేర్కొంది. అయితే డీఎస్సీ కంటే ముందుగా టెట్ నిర్వహించాల్సిందే అని హైకోర్టు ఆదేశించగా.. అధికారులు ఉన్నపళంగా టెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గరిష్ఠ వయోపరిమితిని 46 సంవత్సరాలకు పెంచడం, అదనంగా పోస్టులను చేర్చడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసిన వాళ్లు ఆయా పోస్టులకు మళ్లీ కొత్తగా దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదు.
వివరాలు..
* తెలంగాణ డీఎస్సీ - 2024
ఖాళీల సంఖ్య: 11,062.
➥ సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT): 6,508 పోస్టులు
➥ స్కూల్ అసిస్టెంట్: 2,629 పోస్టులు
➥ లాంగ్వేజ్ పండిట్: 727 పోస్టులు
➥ పీఈటీ (వ్యాయామ ఉపాధ్యాయులు): 182 పోస్టులు
➥ స్పెషల్ ఎడ్యుకేషన్ (స్కూల్ అసిస్టెంట్): 220 పోస్టులు
➥ స్పెషల్ ఎడ్యుకేషన్ (ఎస్జీటీ) 796 పోస్టులు
అర్హతలు..
➥ సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు కేవలం డీఎడ్ పూర్తిచేసినవారు మాత్రమే అర్హులు. బీఈడీ అర్హత ఉన్నవారు పోటీపడటానికి అవకాశంలేదు.
➥ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు (ఎస్‌ఏ) పోస్టులకు సంబంధిత బీఈడీ (మెథడాలజీ) పూర్తిచేసినవారు అర్హులు. నాలుగేళ్ల బీఈడీ పూర్తిచేసినవారు సైతం పోటీపడటానికి అవకాశముంది.
➥ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలి. దీంతోపాటు, యూజీ డీపీఈడీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. డిగ్రీ పూర్తిచేసినవారు.. బీపీఈడీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
➥ బీఎడ్, డీఎడ్ చివరి సంవత్సరం/చివరి సెమిస్టర్ పరీక్షలు రాసినవారు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు.
➥ తెలంగాణ, ఏపీ టెట్, లేదా సెంట్రల్ టెట్ (సీ టెట్)లో క్వాలిఫై అయి ఉండాలి.
➥ గతంలో ఏజెన్సీ పోస్టుల్లో 100 శాతం గిరిజనులకే కేటాయించగా, ఈ నిబంధనను తాజాగా ఎత్తివేశారు. అంతా పోటీపడొచ్చు.
➥ ఎస్టీ రిజర్వేషన్ గతంలో 6 శాతం ఉండగా, పెంచిన 10 శాతాన్నే వర్తింపజేస్తారు.
➥ గతంలో లోకల్, ఓపెన్ కోటా రిజర్వేషన్ 80:20 పద్ధతిలో ఉండగా, తాజాగా 95:5 రేషియోను అమలుచేస్తారు.
➥ అభ్యర్థుల స్థానికతను నిర్ధారించేందుకు గతంలో 4-10 తరగతుల చదువును పరిగణనలోకి తీసుకోగా, తాజాగా 1-7 తరగతులను లెక్కలోకి తీసుకుంటారు.
➥ జీవో-3 ప్రకారం మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలుచేస్తారు. మూడు పోస్టులుంటే ఒక పోస్టును మహిళతో భర్తీ చేస్తారు.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18- 46 సంవత్సరాల మధ్య ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
పరీక్ష విధానం: డీఎస్సీ-2024 పరీక్ష ద్వారా.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.03.2024.
➥ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 02.04.2024. 11:50 PM
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 03.04.2024. 11:50 PM
Print Your Filled In Application Form