ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు టెండర్లు పిలవాలని నిర్ణయించింది. శ్రీకాకుళం, విశాఖపట్నం తీరప్రాంతాల్లో బీచ్‌ శాండ్‌ మైనింగ్‌ కాంట్రాక్టు ఏజెన్సీని ఖరారు చేసే ప్రక్రియను ప్రారంభించింది.  ఏపీ ఎండీసీ ద్వారా శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని సాగర తీరంలో...బీచ్‌ శాండ్‌ మైనింగ్‌ టెండర్లు ఆహ్వానించనుంది. తీర ప్రాంత ఇసుక తవ్వకాల ద్వారా.. మోజైట్‌, ధోరియం లాంటి భార ఖనిజాల తవ్వకాలను చేపట్టేందుకు ఏపీఎండీసీ టెండర్లు పిలవనుంది. టెండర్‌ డాక్యుమెంట్ల పరీశీలన కోసం, ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిషన్‌కు పంపింది. 


శ్రీకాకుళం జిల్లా గార ప్రాంతంలో 909.85 హెక్టార్లు, విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో 90.15 హెక్టార్లలో బీచ్‌ శాండ్‌ తవ్వకాల చేపట్టనుంది. తీరప్రాంతంలో ఇసుక తవ్వకాలకు ఏపీఎండీసీకి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని ప్రభుత్వం వెల్లడించింది. వెయ్యి కోట్ల ఆదాయమే లక్ష్యంగా సారగతీరంలో అరుదైన ఖనిజాల తవ్వకాలకు టెండర్లు పిలుస్తోంది. బీచ్ శాండ్ తవ్వకాల కోసం కాంట్రాక్టు ఏజెన్సీని ఖరారు చేస్తుండటంతో, సలహాలు ఇవ్వాలని బిడ్డర్లతో పాటు ప్రజలను ప్రభుత్వం కోరింది. అక్టోబరు 4 వరకూ టెండర్ డాక్యుమెంట్లను జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్ వెబ్ సైట్‌లో ఉంచనుంది ఏపీ సర్కార్. 


ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ గత నెల తీర్పు ఇచ్చింది. నాగేంద్రకుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం, రాష్ట్రంలోని 110 ఇసుక రీచ్‌లలో తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆదేశాలను తీర్పులో పేర్కొన్న ఎన్జీటీ,  గత ఉత్తర్వులు అరణియార్‌ నదిలోని 18 రీచ్‌లకే పరిమితం కాదని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రిబ్యూనల్‌ తీర్పునకు ఏపీ ప్రభుత్వం వక్రభాష్యం చెప్పిందని మండిపడింది. రాష్ట్ర పర్యావరణ అంచనా కమిటీ ఆదేశాల తర్వాత ఇసుక తవ్వకాలపై నివేదించాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇసుక తవ్వకాలపై జేపీ వెంచర్స్‌ కూడా నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర పర్యావరణ అంచనా కమిటీ ఉత్తర్వులను అమలు చేయాలన్న ఎన్జీటీ.. పర్యావరణ అనుమతులు తీసుకునే వరకు తవ్వకాలు చేపట్టరాదని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.