AP Vehicles Fancy Numbers : వాహనదారులు కొత్త బండి కొన్నప్పుడు ఫ్యాన్సీ నెంబర్ వస్తే బాగుండు అనుకుంటారు. కొందరు వచ్చిన నెంబర్ తో సంతృప్తి పడితే మరికొందరు తమకు కావాల్సిన నెంబర్ కోసం అధిక ధర వెచ్చిస్తారు. నచ్చిన ఫ్యాన్సీ నెంబర్ కోసం లక్షల్లో ఖర్చు పెట్టేవారు కూడా ఉంటారు. అయితే అలాంటి వాహనదారులకు ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. ఇష్టపడో, సెంటిమెంట్ కోసమే అత్యధిక ధర పెట్టి నెంబర్ కొనుగోలు చేస్తుంటారు. కొన్ని స్పెషల్ నెంబర్లను ఆర్టీఏ అధిక ధరకు విక్రయిస్తుంది. ఇకపై వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజును రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
రుసుం భారీగా పెంపు
ప్రస్తుతం ఏపీలో వాహనదారులు ఫ్యాన్సీ నెంబర్ల కోసం రూ. 5 వేలు చెల్లించి వేలంలో పాల్గొనేవారు. ఆ రుసుము ఇప్పుడు రూ. 2 లక్షలకు పెంచుతూ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మోటారు వాహనాల చట్టాన్ని సవరణ చేస్తూ గురువారం నోటిఫికేషన్ తీసుకొచ్చింది. రవాణాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ఫ్యాన్సీ నెంబర్లు కోరుకునే వారు భారీగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. వాటి నుంచి ప్రభుత్వానికి అధిక ఆదాయం రానున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వానికి అదనపు ఆదాయం
రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఏడాదిలో రూ. 100 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫీజులకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉదాహరణకు 9999 ఫ్యాన్సీ నెంబరుకు రూ. 2 లక్షల రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటే, 1, 9, 9999 ఫ్యాన్సీ నెంబర్లకు రూ. లక్ష రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. మిగిలిన ఫ్యాన్సీ నంబర్లకు రూ. 50 వేలు, రూ. 30 వేలు, రూ. 20 వేలు, రూ. 10 వేలు, రూ. 5 వేల రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. ఒకే నంబర్ కు ఒకరి కంటే ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే రేట్ల ఆధారంగా ఫ్యాన్సీ నంబర్లను రవాణా శాఖ అధికారులు బిడ్డింగ్ వేస్తారు. ఫ్యాన్సీ నంబర్ల ఫీజులకు సంబంధించి రవాణా శాఖ చట్ట సవరణ కోసం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై 15 రోజుల్లోగా ఏమైన అభ్యంతరాలు ఉంటే తెలపాలని ప్రభుత్వం సూచించింది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయి.