Sun Eclipse : తెలుగు రాష్ట్రాల్లో పాక్షికంగా కనిపించిన సూర్యగ్రహణ ముగిసింది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు తిరిగి తెరుచుకున్నాయి. ఆకాశంలో అద్భుత ఘట్టం కనిపించింది. ఆశ్వయుజ మాసం బహుళ పక్ష అమావాస్య స్వాతి నక్షత్రంలో సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ సూర్య గ్రహణం పలు దేశాల్లో స్పష్టం కనిపించింది. భారత్‌లో మాత్రం పాక్షకికంగా సూర్యగ్రహణం కనిపించింది. మంగళవారం సాయంత్రం 4.29 గంటలకు దిల్లీలో ప్రారంభం కాగా 4.59 గంటలకు హైదరాబాద్‌లో గ్రహణం మొదలైంది. ఏపీలోని విజయవాడలో 4.49 గంటలకు, తిరుపతిలో గం.5.01 లకు సూర్య గ్రహణం మొదలైంది. హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియంలో సూర్య గ్రహణం వీక్షించేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. దాదాపు 22 ఏళ్ల తర్వాత దీపావళి అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడిందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. గ్రహణాన్ని వీక్షించేందుకు రెండు భారీ టెలిస్కోప్‌లు ఏర్పాటు చేశారు. టెలిస్కోప్ ప్రొజెక్టర్‌కు అనుసంధానం చేసి తెరపైనా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.
శ్రీకాళహస్తికి పోటెత్తిన భక్తులు
సూర్యగ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో భక్తులు పోటెత్తారు. గ్రహణ సమయంలో తెరిచే ఏకైక ఆలయం కావడంతో గ్రహణకాలంలో స్వామి అమ్మవార్ల అభిషేకం చేసేందుకు భారీగా శ్రీకాళహస్తి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అయితే వీఐపీలకు ఇతర సిఫారసు భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ సామాన్య భక్తుల క్యూ లైన్ లో నిలిపివేశారు అంటూ అధికారులతో భక్తులు వాగ్వాదానికి దిగారు. సూర్య గ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తిలో స్వామిని ఏపీ విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆలయ ఛైర్మన్ లు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో సూర్యగ్రహణ కాలంలో పోటెత్తిన భక్తులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిషేక దర్శనానికి రావడంతో భక్తులను నిలిపివేశారు. క్యూ లైన్ ఆపివేయడంతో ఒక్కసారిగా భక్తులు గేట్లు తెంచుకుని బోర్డు సభ్యుడు మున్న రాయల్ తో వాగ్వివాదానికి దిగారు.
తెరుచుకున్న శ్రీవారి ఆలయం
పాక్షిక సూర్యగ్రహణం వీడడంతో తిరుమల శ్రీవారి ఆలయం తెరచుకుంది. మంగళవారం ఉదయం 8:11 గంటలకు ఆలయ మహాద్వారాలను సూర్యగ్రహణానికి పది గంటల ముందే మూసివేశారు. స్వామి వారి దర్శనానికి విచ్చేసే భక్తులను తాత్కాలికంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అనుమతిని రద్దు చేసింది. అంతే కాకుండా తిరుమలలో లడ్డూ వితరణ, అన్నప్రసాదం వితరణను సైతం టీటీడీ నిలిపివేసింది. సూర్య గ్రహణం వీడిన అనంతరం శాస్త్రబద్దంగా ఆలయ అర్చకులు రాత్రి 7:30 గంటలకు టీటీడీ అధికారుల సమక్షంలో ఆలయ ద్వారాలను తెరిచారు. అనంతరం ఆలయ శుద్ది కార్యక్రమం చేపడుతూ ఒక్కొక్క ద్వారాన్ని తెరిచారు ఆలయ అర్చకులు. పుణ్యవచనంను నిర్వహించడంతో గ్రహదోషం తోలగి పోయింది.. అనంతరం మూలవిరాట్టుపై కప్పిన వస్త్రం తొలగించి స్వామి వారికి రాత్రి కైంకర్యాలైన తోమాల, అర్చన సేవలను అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. తరువాత స్వామి వారికి నైవేద్యం సమర్పించిన తర్వాత రాత్రి 8:30 గంటల నుండి సామాన్య భక్తులను శ్రీవారిని దర్శనానికి టీటీడీ అనుమతించనుంది.