Mlc Elections Polling :తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. ఏపీలో పలుచోట్ల ఉద్రిక్తలు నెలకొన్నాయి. వైసీపీ పార్టీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించారు.  ఏపీలో మూడు గ్రాడ్యుయేట్‌, రెండు ఉపాధ్యాయ, నాలుగు స్థానిక సంస్థలకు ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం పోలింగ్‌ జరిగింది. వీటి కౌంటింగ్ ఈ నెల 16న ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏపీలో పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నాయి.  ఏలూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 80.63 శాతం పోలింగ్‌ నమోదైందని అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1105 ఓట్లు ఉండగా మధ్యాహ్నానికి 891 ఓట్లు నమోదు అయ్యాయి. 


 దొంగ ఓట్ల ఆరోపణలు 


 ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొన్ని ఘటనలు మినహా పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అనంతపురం నగరంలోని కేఎస్ఆర్ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నేతల ఆందోళన చేశారు. వైసీపీ నాయకులకు అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దొంగ ఓట్లు వేసేందుకు పోలీసులు, అధికారులు అనుమతి ఇస్తున్నారని రోడ్డుప్తె బైఠాయించి ఆందోళన చేశారు బీజేపీ నాయకులు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో పోలింగ్ కేంద్రం 146 నుంచి ఓటర్ లిస్టును వైసీపీ ఏజెంట్ తీసుకెళ్లడంతో టీడీపీ అభ్యంతరం తెలపడంతో 15 నిమిషాలు పోలింగ్ నిలిపివేశారు. హిందూపురం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి తన ఓటు గల్లంతు కావడంతో నిరాశగా వెనుదిరిగారు.  సమయం ముగిసినా ఓటర్లు క్యూ ల్తెన్ లో ఉండడంతో వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. అనంతపురం జిల్లాలో మధ్యాహ్నం 02 గంటల వరకు పట్టభద్రులకు సంబంధించి 49.93 శాతం, ఉపాధ్యాయులకు 64.22 శాతం శాతం పోలింగ్ నమోదు అయింది.  పోలింగ్ సమయం ముగిసినా 4 గంటలకు క్యూ లైన్లో ఉన్న ఓటర్ల అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో 60.73 శాతం నమోదు అయింది. విజయనగరంలో ఓటర్లు క్యూలైన్ ఉండడంతో  6 గంటలవరకూ పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. అనకాపల్లి నర్సీపట్నం పోలింగ్ స్టేషన్ వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకున్నారు.  పోలీసులు వారిని చెదరగొట్టారు.  


తిరుపతిలో ఉద్రిక్తత 


తిరుపతిలో ఎమ్మెల్సీ ఎన్నికల ముగింపు సమయంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక పోలీస్ క్వార్టర్స్ లోని కుమ్మరితోపు పోలింగ్ బూత్ వద్ద  పోలింగ్ కేంద్రంలోకి వెళుతున్న దొంగ ఓటర్లను టీడీపీ నేతలు అడ్డుకోవడంతో వైసీపీ టీడీపీ‌ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో టీడీపీ కార్యకర్తలను దుర్భాషలాడుతూ వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. దీంతో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు పాలయ్యారు. వైసీపీ నాయకుల దాడికి నిరసనగా టీడీపీ, బీజేపీ నాయకులు పోలింగ్ కేంద్రం వద్ద ధర్నాకు దిగ్గారు. దొంగ ఓట్లు వేసేందులు సహకరించారంటూ డీజీపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. 


తెలంగాణలో ప్రశాంతంగా ఎన్నికలు 
 
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి హైదరాబాద్,  రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. అయితే సమయం ముగిసేసరికి క్యూలైన్లలో ఉన్నవారంతా ఓటుహక్కు వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ ప్రక్రియ సజావుగా సాగినట్లు అధికారులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు 75 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు వెల్లడించారు.  సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 90శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలిపారు. అయితే పోలింగ్ శాతంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 


స్ట్రాంగ్ రూమ్ లకు బ్యాలెట్ బాక్సులు 


సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు మహబూబ్‌నగర్‌ జిల్లాలో 64 శాతం, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 81 శాతం, గద్వాల్‌లో 88శాతం,నారాయణ్‌పేట్‌లో 81శాతం, రంగారెడ్డిలో 65 శాతం, వికారాబాద్‌ జిల్లాలో 79, హైదరాబాద్‌లో 68శాతం, మేడ్చల్‌ మల్కాజిగిరి 68 పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సుమారు 75 శాతం పోలింగ్‌ నమోదైనట్లు స్పష్టం చేశారు. అయితే సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ శాతం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం బ్యాలెట్‌ బాక్సులకు  సరూర్‌నగర్‌లోని ఇండోర్‌ స్టేడియంలోని స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరుస్తున్నారు. ఈ నెల 16వ తేదీ ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తారు.