Breaking News Live: మాదాపూర్‌లో కారు బీభత్సం.. ఒకరు మృతి 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 9న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 09 Oct 2021 07:41 PM
మాదాపూర్‌లో కారు బీభత్సం.. ఒకరు మృతి 

హైదరాబాద్‌ నగరంలోని మాదాపూర్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు పాదచారుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. కారు నడిపిన వ్యక్తి విద్యుత్‌ శాఖ డీఈ నరేందర్ రెడ్డిగా గుర్తించారు. ప్రమాదం అనంతరం పీఎస్‌కు వెళ్లి నరేందర్‌ రెడ్డి లొంగిపోయారు. 

నెల్లూరు-ముంబై హైవేపై మరో ప్రమాదం.. 

నెల్లూరు-ముంబై హైవేపై ప్రమాదం జరిగింది. మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాకు బోర్డు వద్ద కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడు అనంతసాగరం మండలం మంగుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు.

అఖేరు వాగులో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములకలపల్లి ఆకేరు వాగులో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఖమ్మం నగరానికి  చెందిన 5 మంది విద్యార్థులు సాయంత్రం అఖేరు వాగుకు వద్దకు చేరుకున్నారు. ఈత కోసం వాగులో దిగిన యువకులు ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలతో బయటపడగా మరో ఇద్దరు వాగులో కొట్టుకుపోయారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈత గాళ్లతో వెతికిస్తున్నారు.

ఏపీ, తెలంగాణ హైకోర్టులకు నూతన సీజేలు నియామకం

ఏపీ తెలంగాణ హైకోర్టులకు నూతన చీఫ్ జస్టిస్ లు నియమితులయ్యారు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేశారు.  

హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం... అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచన

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ ఇప్పటికే ప్రకటించింది. శుక్రవారం నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి.  దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, ఖైరాతాబాద్, అమీర్ పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో భారీ వర్షం కురుస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

రూ.200 కోట్ల మోసం కేసులో సుఖేష్ చంద్రశేఖర్, నటి లీనా మరియా పాల్‌ అరెస్ట్

రూ.200 కోట్లు మోసగించిన కేసులో సుఖేష్ చంద్రశేఖర్, ఆయన భాగస్వామి.. నటి లీనా మరియా పాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. 14 రోజుల రిమాండ్ కోరుతూ వారిని ఢిల్లీ కోర్టులో శనివారం హాజరుపరిచారు.

బద్వేలులో బీజేపీతో విజయానికి పని చేస్తాం: నాదెండ్ల మనోహర్‌

కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీ విజయం కోసం పని చేస్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. బీజేపీతో తాము పొత్తులో ఉన్నందున ఆ ధర్మాన్ని పాటిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని ఆయన విమర్శించారు. ఒంగోలులో సీఎం పర్యటన కోసం సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తూ సభ ఏర్పాటు చేశారని మనోహర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సభకు రావాలని వాలంటీర్లతో మహిళను బెదిరించారని చెప్పారు.

నిజామాబాద్‌లో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్

నిజామాబాద్​ నగరంలో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్​ కలకలం సృష్టించింది. నగరంలోని బస్టాండ్​ సమీపంలో ఉన్న సౌత్​ ఇండియా షాపింగ్​ మాల్​కు మెట్​పల్లికి చెందిన నూరిన్ సుల్తానా సల్మాన్ కుటుంబం తమ కుమార్తెతో కలిసి వచ్చారు. షాపింగ్​ పూర్తి చేసుకుని కౌంటర్​లో బిల్లు చెల్లిస్తున్న సమయంలో కుమార్తె.. అదృశ్యమైంది. వెంటనే బయటకు వచ్చి చూసే సరికి... పాపను బురఖా ధరించినా మహిళలు అపహరించి.. ఆటోలో తీసుకెళ్లారని తల్లి నూరిన్ సుల్తానా, తండ్రి సల్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

లఖింపూర్ రైతుల హత్య కేసులో పోలీసుల ముందుకు కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా

లఖింపూర్ హింసాకాండలో ప్రధాన నిందితుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ ఈరోజు క్రైమ్ బ్రాంచ్ ముందు హాజరయ్యారు. లఖింపూర్ పోలీసులు ఆశిష్‌ను ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఒక నోటీసును శుక్రవారం ఆయన ఇంటిముందు అంటించారు. అంతకుముందు, గురువారం కూడా పోలీసులు శుక్రవారం రాత్రి 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసు ఇచ్చారు. కానీ, ఆశిష్ చేరుకోలేదు. తరువాత, ఆశిష్ అనారోగ్యంతో ఉన్నాడని ఒక లేఖ రాశాడు. ఇవాళ పోలీసుల ఎదుట హాజరయ్యాడు.

హైదరాబాద్‌- బెంగళూరు మార్గంలో వరద.. 3కి.మీ మేర నిలిచిన వాహనాలు

హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌-బెంగళూరు రహదారిపై వరద నీరు భారీగా నిలిచింది. నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద ఓ లారీ బ్రేక్‌ డౌన్‌ అయి వరదనీటిలో చిక్కుకుంది. ఫలితంగా హైదరాబాద్‌-బెంగళూరు మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. రహదారికి ఇరువైపులా 3 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అరాంఘర్‌- శంషాబాద్‌ రహదారిపై కూడా వరద నీటితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Background

దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబాదేవి శుక్రవారం భక్తులకు బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ వేదికపై బ్రహ్మచారిణి అమ్మవారిని ఆలయ సిబ్బంది విశేష పుష్పాలంకరణలతో కొలువుదీర్చారు

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.