Breaking News Live Updates: బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవదహనం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 26న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 26 Oct 2021 09:21 PM
బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవదహనం

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తమిళనాడులోని కళ్లకురిచిలోని శంకరాపురం బాణసంచా కేంద్రంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు సజీవదహనం కాగా, మరో 10 మంది వరకు కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. 

కర్నూలులో రూ.3 లక్షల విలువైన తెలంగాణ మద్యం పట్టివేత

వినూత్న రీతిలో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వాహనాన్ని కర్నూలు సెబ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి తరలిస్తున్న రూ.3 లక్షల విలువైన తెలంగాణ మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసినట్లు కర్నూలు సెబ్ అధికారి భరత్ నాయక్ తెలిపారు. కర్నూలు ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద దాడుల్లో రూ.3 లక్షల విలువ చేసే 732 మద్యం బాటిల్స్ పట్టుకున్నామన్నారు. తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తి అరెస్టు చేసి వాహనాలను సీజ్ చేశారు. అక్రమ మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సెబ్ అధికారి భరత్ హెచ్చరించారు.


 

ముంబయి డ్రగ్స్ కేసులో ఇద్దరికి బెయిల్ 

ముంబయి క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో అరెస్టైన వారిలో ఇద్దరికి బెయిల్‌ మంజూరైంది. ముంబయిలోని ఎన్‌డీపీఎస్‌ కేసుల విచారణ చేస్తున్న ప్రత్యేక న్యాయస్థానం మనీశ్‌ రాజ్‌గారియా, అవిన్‌ సాహూలకు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ కూడా ఇదే కేసులో నిందితుడిగా అరెస్టు అయ్యారు. అక్టోబర్‌ 2న ఎన్సీబీ దాడి చేసిన క్రూజ్‌ నౌకలో వీళ్లు ఉన్నట్లు కోర్టుకు తెలిపింది. ఇప్పటివరకు ఈ కేసులో ఆర్యన్‌తో పాటు 20 మందిని ఎన్‌సీబీ అరెస్టు చేసింది. ఇటీవల ఆర్యన్‌కు ఈ కోర్టు బెయిల్‌ నిరాకరించింది. దీంతో ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. బాంబే హైకోర్టు రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్యన్‌ సహా అర్బాజ్‌ మర్చంట్‌, మూన్‌మూన్‌ ధమేచా బెయిల్‌ పిటిషన్లపై వాదనలు విననుంది. 

హుజూరాబాద్ లో రోడ్డు ప్రమాదం... 10 మంది టీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలు

హుజూరాబాద్‌ మండలం రాజపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారం కోసం వస్తున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తల టాటా ఏస్‌ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. టాటా ఏస్‌లో మొత్తంగా 20 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదం విషయం తెలిసిన మంత్రి గంగుల కమలాకర్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ప్రాణనష్టం జరగకుండా మెరుగైన వైద్య సదుపాయాల కల్పించాలన్నారు. మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 


 

నటి సమంతకు కూకట్‌పల్లి  కోర్టులో ఊరట... కంటెంట్ తొలగించాలని ఆదేశాలు

కూకట్‌పల్లి కోర్టులో సమంతకు ఊరట లభించింది. సమంత వ్యక్తిగత వివరాలను ప్రసారం చేయడానికి వీళ్లేదని, యూట్యూబ్‌ ఛానెల్స్‌ వెంటనే ఆ కంటెంట్‌ని తొలగించాలని ఆదేశించింది. ఆమె వ్యక్తిగత విషయాలపై సోషల్‌ మీడియాలో పెట్టిన కామెంట్స్‌ని కూడా తొలగించాలని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో తన పరువుకు భంగం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం కూకట్‌పల్లి కోర్టు విచారించింది. రెండు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు, డాక్టర్ సీఎల్ వెంకట్ రావు ప్రసారాలు చేసిన యూట్యూబ్ లింకులను వెంటనే తొలగించాలని కూకట్ పల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. 


 

ఆవును తప్పించబోయి ఆటో బోల్తా, ఇద్దరు మృతి

అనంతపురం జిల్లా రాయదుర్గం గుమ్మగట్ట మండలం 75 వీరాపురం తాండ సమీపంలో ఆవును తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కేపీ.దొడ్డి గ్రామం నుంచి రాయదుర్గం పట్టణానికి  ప్రయాణీకులను తీసుకెళ్తుండగా ఆవును ఢీకొట్టింది. అకస్మాత్తుగా రోడ్డు పైకి ఆవు రావడంతో తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

లఖీంపూర్ ఖేరీ రైతుల అస్తికలు తుంగభద్రలో కలిపిన సీపీఎం నేతలు

ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీలో మృతి చెందిన రైతుల అస్తికలను సీపీఎం, రైతు సంఘాల నాయకులు కర్నూలు తుంగభద్ర నదిలో కలిపారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు యంఏ. గఫూర్ మాట్లాడుతూ అమరులైన రైతుల త్యాగం వృధా కానివ్వమని రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. రైతుల మరణానికి కారణమైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అమిత్ మిశ్రా కుమారుడిని కఠినంగా శిక్షించి, అమిత్ మిశ్రాను మంత్రి వర్గం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా నవంబర్ నెల మొత్తం నిరసనలు తెలుపుతామని గఫూర్ తెలిపారు.


 

బస్సు ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ మృతి

నెల్లూరు ముంబయి జాతీయ రహదారిపై బుచ్చిరెడ్డిపాలెం మండలం ఆర్.ఆర్ నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నెల్లూరు నుంచి కడప వెళ్తుండగా బైక్ ని ఢీకొంది. ఈ క్రమంలో బుచ్చిరెడ్డిపాలెం నుంచి దామరమడుగు వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్ రెడ్డిపోగు శివ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే చనిపోయాడు. బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసుకుని తిరిగి తన స్వగ్రామం దామరమడుగు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

హుజూరాబాద్ ఉప ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ తమ మేనిఫెస్టో విడుదల చేసింది. బీజేపీ కేంద్ర నేత తరుణ్ చుగ్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే నెల 2న టీఆర్ఎస్ అహంకారానికి అడ్డుకట్ట పడుతుందన్నారు. ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుండగా, 27న రాత్రి 7 గంటలకు ప్రచారం ముగియనుంది.

  తహశీల్దార్ కార్యాలయంలో తల్లి మృతదేహంతో కుమార్తెల ఆందోళన

అనంతపురం జిల్లా బత్తలపల్లి తహశీల్దార్ కార్యాలయంలో తల్లి మృతదేహంతో ఇద్దరు కుమార్తెలు ఆందోళనకు దిగారు.   భూమి మార్పిడి కోసం తహశీల్దార్ కార్యాలయం చుట్టూ  తమ తల్లి తిరిగిందని కుమార్తెలు చెబుతున్నారు. భర్త పేరిట భూమిని తన పేరిట మార్చాలని ఏడేళ్లు తిరిగినా ఫలితం లేదని చెబుతున్నారు.

వీహెచ్ ఆందోళన

దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ నేత వీ హన్మంతరావు ఆందోళన చేపట్టారు. లక్డీకాపూల్ వద్ద రహదారిపై కూర్చొని ఆయన నిరసన తెలిపారు. పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించే వరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందని చెప్పారు.

ట్యాంక్ బండ్‌పై ధర్నా

హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై మాల మహానాడు నాయకులు ఆందోళన చేశారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ట్యాంక్ బండ్‌పై అంబేడ్కర్ విగ్రహం ముందు వీరంతా ఆందోళన చేపట్టడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఆందోళనలో మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య కూడా పాల్గొన్నారు. 

 మహిళా కార్యదర్శులకు పోలీసు విధులు ఎలా అప్పగిస్తారు.. సీఎస్‌, డీజీపీకి హైకోర్టు నోటీసులు 

గ్రామ సచివాలయాల్లో మహిళా కార్యదర్శులను పోలీసులుగా నియమించడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పిటిషనర్ తరఫు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు. సీఎస్‌, డీజీపీ, హోం కార్యదర్శికి నోటీసులు జారీచేసింది హైకోర్టు. పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌కు కూడా నోటీసులు ఇచ్చింది. రెవెన్యూలో 15 వేలమందికి పోలీసు విధుల అప్పగింతపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా కార్యదర్శులుగా నియమించి పోలీసు విధుల అప్పగింతపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. మహిళా కార్యదర్శులకు పోలీసు విధులు ఎలా ఇస్తారో చెప్పాలని ఆదేశించింది. 1859 ఏపీ డిస్ట్రిక్ట్ పోలీస్ యాక్టుకు విరుద్ధమని న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐసీఎంఆర్ బృందం పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బేతలపల్లి శివారు గిరిజన తండాల్లో ఐసీఎంఆర్ బృందం పర్యటించింది. తండాల్లో కిడ్నీ వ్యాధికి గురైన వారి వద్ద వివరాలు సేకరించారు. ఈ సందర్బంగా జాతీయ పౌష్టికాహార సంస్థ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు కిడ్నీ వ్యాధులకు గురికాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గ్రామస్తులకు వివరించారు.

Background

దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓల్డ్ సీమాపురిలో మూడంతస్తుల భవనం పై ఫ్లోర్​లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు సజీవదహనమయ్యారు. మృతులను హౌరీ లాల్, రీనా, అషు, రాధికగా గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు.. హుటాహుటిన తరలి వచ్చి.. మంటలను ఆర్పేశాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.