Breaking News Live Telugu Updates: వరంగల్ పోలీసుల అదుపులో ముగ్గురు మావోయిస్టులు!

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 09 Oct 2022 03:28 PM
వరంగల్ పోలీసుల అదుపులో ముగ్గురు మావోయిస్టులు!

వరంగల్ పోలీసులు కీలక మావోయిస్ట్ నేతలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వైద్యం కోసం వరంగల్ కు వస్తుండగా మావోయిస్టులను పట్టుకున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు మావోయిస్టులతో పాటు ఓ రాజకీయ నాయకుడు ఉన్నట్లు సమాచారం. పట్టుబడ్డవారిలో బస్తర్ ఏరియా మహిళా కమాండర్ కూడా ఉన్నారని తెలుస్తోంది. అయితే మావోయిస్టుల అరెస్టుపై పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. 

Tirumala News: తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు

పెరటాసి మాసం చివరి వారం కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తున్నారు. పవిత్ర మాసమైన పెరటాసి మాసంలో స్వామి వారిని ప్రత్యక్షంగా దర్శించుకుంటే చేసిన పాపాలు తొలగి, ముక్తికి మార్గం పొందుతారని విశ్వాసం ఎప్పటి నుండో వస్తోంది. తమిళనాడు రాష్ట్రం నుండి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. స్వస్థలం నుండి పాదయాత్రగా కొందరు భక్తులు వస్తుంటే, మరికొందరు వివిధ మార్గాల గుండా తిరుమలకు చేరుకుంటున్నారు. అలిపిరి నడక మార్గంలో రేయింబవళ్ళు తేడా లేకుండా భక్తులు నడక సాగిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి ముప్పై నుండి నలభై గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఎన్ని గంటలైనా సరే స్వామి వారిని దర్శించుకోనిదే వెను తిరగడం లేదని అంటున్నారు భక్తులు. క్యూలైన్స్ లో‌ నిరంతరాయంగా భక్తులకు అన్నప్రసాదం, పాలు, తాగు నీరు అందిస్తున్నారు. తిరుమలలో నెలకొన్న భక్తులు రద్దీపై మా ప్రతినిధి రంజిత్ మరింత సమాచారం అందిస్తారు.

Nandyala: పిచ్చికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలికకు తీవ్ర గాయాలు

నంద్యాల జిల్లా కేంద్రంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పిచ్చికుక్కల దాడిలో చాంద్ బాడకు చెందిన నాలుగేళ్ల బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి వైద్యులు వైద్యం అందిస్తున్నారు. పట్టణంలో కుక్కల బెడద అధికంగా ఉందని చాందుబాడ వాసులు ఎన్నిసార్లు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రా రెడ్డికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని, పాపకు ఏదైన జరగరానిది జరిగితే మున్సిపల్ కమిషనర్ దే బాధ్యత అంటూ బాదితురాలి తండ్రి అవేదనతో చెబుతున్నారు.

Kakinada: కాకినాడ యువతి హత్య కేసులో ఎస్పీ ఎం.రవీంద్రబాబు ప్రెస్ మీట్

  • కాకినాడ జిల్లా కాండ్రేగుల కూరాడ లో దేవిక (22) అనే యువతి హత్య కేసులో కాకినాడ ఎస్పీ ఎం.రవీంద్రబాబు ప్రెస్ మీట్

  • మృతురాలు దేవిక, నిందితుడు గుబ్బల సూర్యనారాయణ మూర్తిల మధ్య గతంలో నుంచి సాన్నిహిత్యం 

  • వేరే వాళ్లతో సాన్నిహిత్యంగా ఉంటుందని అనుమానంతోనే హత మార్చాడు

  • ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. కానీ కొన్ని కారణాలవల్ల పెద్దల సమక్షంలో విడిపోయారన్న ఎస్పీ

  • ఈ నేపథ్యంలోనే కాపుగాసి కత్తితో దాడికి పాల్పడి హతమార్చాడు: ఎస్పీ

  • దాడికి ముందు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం

  • సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు

  • తీవ్ర గాయాలతో ఉన్న యువతిని అంబులెన్స్ ఆసుపత్రికి తరలింపు, అయినా ఆమె మృతి

Hindupur: హిందూపురంలో వైస్సార్సీపీ నేత రామకృష్ణారెడ్డి దారుణ హత్య

శ్రీ సత్య సాయి జిల్లాలో హిందూపురం నియోజకవర్గం వైస్సార్సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. చౌళూరులోని తన ఇంటి ముందు కారులో దిగుతుండగా కళ్ళల్లో కారం పొడి చల్లి వేట కొడవళ్ళతో నరికి గుర్తుతెలియని దుండగులు దారుణంగా మట్టుబెట్టారు. తన కుమారుడి హత్యకు కారణం ఎమ్మెల్సీ ఇక్బాల్, ఆయన సహాయకుడు గోపి, చాకలి రవి, నంజుండ రెడ్డి, మురళి, కేపీ నాగుడు తదితరుల హస్తం ఉన్నట్లు మృతుడు రామకృష్ణారెడ్డి తల్లి ఆరోపించారు. హత్య వెనుక ఎమ్మెల్సీ ఇక్బాల్ హస్తం ఉందని స్వయంగా  మృతుని తల్లి ఆరోపించడం గమనార్హం.

Background

నేడు బంగాళాఖతంలో మరో అల్పపీడనం ఏర్పడుతోంది. త్వరలో ఈశాన్య రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానాంలలో చివరిసారిగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టినా, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానాంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి.


తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
అల్పపీడనం ప్రభావంతో వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అక్టోబర్ 9 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. మరికొన్ని గంటల్లో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం అలర్ట్ చేసింది. శనివారం హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో, ఉమ్మడి మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజమాబాద్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
తమిళనాడు వైపు నుంచి వస్తున్న అల్పపీడనం ప్రభావం మొదలైంది. ప్రస్తుతానికి కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయి. మరో రెండు గంటల్లో విశాఖ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభాంతో 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయి.  


తెల్లవారిజామున ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు జోరందుకుంటాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఉభయ గోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. తీరంలో 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో నైరుతి, తూర్పు బంగాళాఖాతం దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లడం క్షేమదాయకం కాదని అధికారులు హెచ్చరించారు.


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
తాజాగా ఏర్పడుతున్న అల్పపీడనం దక్షిణ కోస్తాంధ్రపై ప్రభావం చూపనుంది. ఈ ప్రాంతాల్లో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. నెల్లూరు జిల్లాలోని కొస్తా భాగాలు, కృష్ణా, కొనసీమ జిల్లల్లో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. ప్రకాశం జిల్లా పశ్చిమ భాగాలు, గుంటూరు, పల్నాడు, ఎన్.టీ.ఆర్ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు పడతాయి. అల్పపీడనం మరింత బలపడటంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. తిరుపతి నగరంతో పాటుగా తిరుపతి జిల్లాలోని పుత్తూరు, రేణిగుంట పరిసరాల్లో వర్ష సూచన ఉంది. అన్నమయ్య, కడప జిల్లాల్లో ఒకట్రెండు వర్షాలు పడే ఛాన్స్ ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.